క్రిస్‌ గేల్‌ వచ్చేశాడు..

15 Oct, 2020 19:15 IST|Sakshi

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు సాధించగా,  కింగ్స్‌ పంజాబ్‌ ఏడు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. అది కూడా ఆర్సీబీపైనే భారీ విజయం సాధించింది కింగ్స్‌ పంజాబ్‌. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది విరాట్‌ గ్యాంగ్‌. ఇప్పటివరకూ ఇరుజట్లు 25సార్లు ముఖాముఖి తలపడితే కింగ్స్‌ పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గత జట్టుతోనే బరిలోకి దిగుతుండగా,  కింగ్స్‌ పంజాబ్‌ మూడు మార్పులు చేసింది. క్రిస్‌ గేల్‌, దీపక్‌ హుడా, మురుగన్‌ అశ్విన్‌ జట్టులోకి వచ్చారు. ప్రబ్‌సిమ్రాన్‌, ముజీబ్‌, మన్‌దీప్‌లకు విశ్రాంతి ఇచ్చారు. (కేఎల్‌ రాహుల్‌కు కోహ్లి వార్నింగ్‌!)

ఇరుజట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టులో కోహ్లి, దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌లు బ్యాటింగ్‌ బలంగా కాగా, బౌలింగ్‌లో చహల్‌, ఇసురు ఉదాన, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీలు కీలకంగా ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో క్రిస్‌ మోరిస్‌ ఉండటంతో ఆర్సీబీ బలం పెరిగింది. ఇక కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌లే ప్రధానం, బౌలింగ్‌లో మహ్మద్‌ షమీ, రవి బిష్నోయ్‌, షెల్డాన్‌ కాట్రెల్‌లు కీలకం. తాజాగా క్రిస్‌ గేల్‌ రావడంతో అతను ఎలా ఆడతాడనే దాని కోసం కింగ్స్‌ పంజాబ్‌ అభిమానులు ఆశగా చూస్తున్నారు. గేల్‌ విరుచుకుపడి పంజాబ్‌కు విజయాన్ని అందిస్తాడనే ధీమాతో ఉన్నారు ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌.

డివిలియర్స్‌ వర్సెస్‌ బిష్నోయ్‌
ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌-బిష్నోయ్‌ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న డివిలియర్స్‌కు యువ స్పిన్‌ అస్త్రం బిష్నోయ్‌ నుంచి ప్రమాదం లేకపోలేదు. ఈ ఐపీఎల్‌ ద్వారా అరంగేట్రం చేసిన బిష్నోయ్‌లో రెట్టించిన ఆత్మవిశ్వాసం కనబడుతోంది. ఒక బంతిని కొట్టినా ఆ తర్వాత ఎటువంటి జంకు లేకుండా బౌలింగ్‌ చేస్తున్న తీరు శభాష్‌ అనిపిస్తోంది. ఇప్పటివరకూ బిష్నోయ్‌ ఎనిమిది వికెట్లు సాధించగా, డివిలియర్స్‌ 228 పరుగులు సాధించాడు. ఇక్కడ ఏబీడి స్టైక్‌రేట్‌ 185. 36 గా ఉండగా, బిష్నోయ్‌ ఎకానమీ 7.85గా ఉంది. ఇక రాహుల్‌- క్రిస్‌ మోరిస్‌ల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఈ సీజన్‌లో రాహుల్‌ 387 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అందులో అజేయంగా 132 పరుగులు సాధించాడు. మరొకవైపు మోరిస్‌ ఆర్సీబీ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడి ఐదు వికెట్లు సాధించాగు. ఇక్కడ మోరిస్‌ ఎకానమీ 4.50గా ఉంది. 

ఆర్సీబీ తుదిజట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, దేవదూత్‌ పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబే, క్రిస్‌ మోరిస్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్, చహల్‌

కింగ్స్‌ పంజాబ్‌
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌, క్రిస్‌ గేల్‌, మ్యాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, క్రిస్‌ జోర్డాన్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, రవి బిష్నోయ్‌, అర్షదీప్‌ సింగ్‌

మరిన్ని వార్తలు