WPL 2023 RCB W Vs UPW: చెలరేగిన ఆర్‌సీబీ బౌలర్లు.. యూపీ వారియర్జ్‌ 135 ఆలౌట్‌

15 Mar, 2023 21:50 IST|Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆర్‌సీబీ తొలిసారి చెలరేగింది. ప్లేఆఫ్ ఆశలు  సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  రాణించారు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన కనబరచడంతో యూపీ వారియర్జ్‌ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.

టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన  యూపీ  ఇన్నింగ్స్ ఆది నుంచి ఒడిదొడుకుల మధ్యే సాగింది. తొలి ఓవర్లోనే  రెండు వికెట్లు కోల్పోయింది. సోఫీ డివైన్ వేసిన తొలి ఓవర్లో  రెండో బంతికే దేవికా వైద్య (0)  ఎల్బీగా వెనుదిరిగింది.   అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ అలీస్సా హేలి  (1) కూడా  ఔటయింది.  మేగన్ స్కాట్ వేసిన రెండో ఓవర్లో   ఆఖరి బంతికి  తహిలా మెక్‌గ్రాత్ (2)  రిచా గోష్ కు క్యాచ్  ఇచ్చింది.

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కిరణ్ నవ్‌గిరె (26 బంతుల్లో  22,  2 ఫోర్లు, 1 సిక్సర్)  ఆదుకోవడానికి యత్నించింది.  కానీ  ఆశా శోభన  యూపీకి షాకిచ్చింది.  ఆమె వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి నవ్‌గిరె.. వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆశా  వేసిన 9వ ఓవర్  తొలి బంతికి సిమ్రాన్ షేక్ (2) కూడా కనికకు క్యాచ్ ఇచ్చింది. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి యూపీ ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

యూపీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా హరీస్ (32 బంతులలో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం  నిలకడగా ఆడింది.  దీప్తి శర్మ (19 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి ఆమె యూపీ ఇన్నింగ్స్ ను నడిపించింది.   యూపీ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది  హరీస్ చలవే.  దీప్తి శర్మతో కలిసి  హరీస్ 42 బంతుల్లోనే 69 పరుగులు జోడించింది. అర్థ సెంచరీ పూర్తి చేసుకుని భారీ స్కోరు మీద కన్నేసిన ఈ జోడిని ఎలీస్ పెర్రీ విడదీసింది. ఆమె వేసిన 16వ ఓవర్లో  తొలి బంతికి  దీప్తి.. భారీ షాట్ ఆడబోయి శ్రేయాంక పాటిల్ చేతికి చిక్కింది.

అదే ఓవర్లో మూడో బంతికి హరీస్  కూడా  రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది.  దీంతో యూపీ ఏడో వికెట్ కోల్పోయింది. పెర్రీనే వేసిన  18వ ఓవర్లో  రెండో బంతికి శ్వేతా సెహ్రావత్  (6) క్లీన్ బౌల్డ్ అయింది.  చివరి ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్.. రెండో బంతికి అంజలి శర్వని (8) ని ఔట్ చేయగా..  తర్వాత బంతికే  ఎకిల్‌స్టోన్ (12) రనౌట్ అయింది. పలితంగా  యూపీ.. 135 పరుగులకు ఆలౌట్ అయింది.  ఆర్‌సీబీ బౌలర్లలో పెర్రీ మూడు వికెట్లు తీయగా, ఆశా శోభన, సోఫీ డివైన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్ చెరొక  వికెట్ తీశారు

>
మరిన్ని వార్తలు