ఆర్సీబీ టపటపా...

24 Sep, 2020 22:19 IST|Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  207 పరుగుల టార్గెట్‌లో ఒత్తిడికి లోనైన ఆర్సీబీ నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ మూడు ఓవర్లు ఆడకుండానే మూడు వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో మెరిసిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌(1) నిరాశపరచగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. దేవదూత్‌ను కాట్రెల్‌ బోల్తా కొట్టించగా, ఫిలిప్పిను షమీ ఔట్‌ చేశాడు. ఇక ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. కాట్రెల్‌ బౌలింగ్‌ షాట్‌ ఆడిన కోహ్లి.. రవి బిష్నోయ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభించింది ఎలా ఆడుతుందో చూద్దామనుకునే లోపే మూడు కీలక వికెట్లు కోల్పోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఫించ్‌(20)ను రవి బిష్నోయ్‌ బౌల్డ్‌ చేశాడు. ఆపై ఏబీ డివిలియర్స్‌( 28; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కాసేపు మెరుపులు మెరిపించినా ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. ఆర్సీబీ 8.2 ఓవర్లలో 57 పరుగులు చేసి ఐదు వికెట్లను నష్టపోయింది.(చదవండి: బ్రెట్‌ లీ ఉన్నా సేవ్‌ చేయలేకపోయాడు!)

అంతకుముందు కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫెయిలైన రాహుల్‌.. ఆర్సీబీ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. .లయ తప్పిన బంతిని బౌండరీలు దాటించడమే లక్ష్యంగా ఆడాడు.  ఈ క్రమంలోనే 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రాహుల్‌ బ్యాట్‌కు మరింత పనిచెప్పాడు. మరొక ఎండ్‌ నుంచి సరైన సపోర్ట్‌ లేకపోయినా రాహుల్‌ మాత్రం రెచ్చిపోయాడు. ప్రధానంగా స్లాగ్‌ ఓవర్లలో రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  62 బంతుల్లో  12 ఫోర్లు,  3 సిక్స్‌లతో శతకం సాధించాడు. ఇది ఈ ఐపీఎల్‌ తొలి శతకంగా నమోదైంది. రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేయడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని శతకంతో మెరిశాడు. 69 బంతుల్లో  14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పో‍యి 206 పరుగులు చేసింది.(చదవండి: రెచ్చిపోయిన కేఎల్‌ రాహుల్‌)

టాస్‌ గెలిచిన ఆర్సీబీ ముందు ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉండగా మయాంక్‌(26; 20 బంతుల్లో 4 ఫోర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. యజ్వేంద్ర చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి మయాంక్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు.  రాహుల్‌ తన సహజసిద్ధమైన షాట్లతో అలరిస్తూ స్కోరు బోర్డును పెంచాడు. ఇక పూరన్‌ ఆది నుంచి బ్యాటింగ్‌ చేయడానికి తడబడుతూ కనిపించాడు. చివరకు వీరిద్దరూ 57 పరుగుల భాగ‍్వామ్యాన్ని .జత చేసిన తర్వాత పూరన్‌(17) పెవిలియన్‌ చేరాడు. శివం దూబే బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికి మ్యాక్స్‌వెల్‌(5) కూడా పెవిలియన్‌ చేరడంతో కింగ్స్‌ 128 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కానీ రాహుల్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి సెంచరీ సాధించాడు. ఇది రాహుల్‌కు ఐపీఎల్‌ రెండో సెంచరీ కాగా, ఈ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత ఆటగాడిగా ఈ కింగ్స్‌ కెప్టెన్‌ నిలిచాడు.(చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు