‘నమ్‌దే’ ఇంకెప్పుడు?

2 Apr, 2021 05:19 IST|Sakshi

బెంగళూరుకు అందని ఐపీఎల్‌ ట్రోఫీ

తొలి టైటిల్‌పై ఆర్‌సీబీ ఆశలు  

సాక్షి క్రీడా విభాగం:

‘ఓటములు మమ్మల్ని ఓడించలేవు. పోరాట స్ఫూర్తి మమ్మల్ని సజీవంగా ఉంచుతుంది’... తమ అధికారిక వెబ్‌సైట్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) టీమ్‌ రాసుకున్న వాక్యం ఇది. అదేంటో గానీ పోరాటాలే తప్ప జట్టు ఖాతాలో విజయాలు మాత్రం లేవు. ఐపీఎల్‌లో పాపులారి టీ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదు, పెద్ద సంఖ్యలో అభిమాన గణం, వాణిజ్యపరంగా చూస్తే వహ్వా అనిపించే కంపెనీలతో సహవాసం... స్వయంగా భారత కెప్టెన్‌ సుదీర్ఘ కాలంగా జట్టును నడిపిస్తుండగా, టి20లో విధ్వంసానికి చిరునామాలాంటి డివిలియర్స్, గతంలో గేల్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం సున్నా! మూడుసార్లు ఫైనల్లో ఓడిన బెంగళూరు ఇప్పుడైనా ఆ గండాన్ని దాటి కన్నడ అభిమానులతో ‘కప్‌ నమ్‌దే ( మనదే)’ అనిపిస్తుందో లేదో వేచి చూడాలి!

కొత్తగా వచ్చినవారు
ఐపీఎల్‌ వేలంలో ఆర్‌సీబీ ఇద్దరు ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమీసన్‌ (రూ. 15 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (రూ. 14.25 కోట్లు)లకు అనూహ్య మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. వేలానికి ముందు విదేశీ ఆల్‌రౌండర్, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అవసరం ఆ జట్టుకు ఉంది. అందుకు తగినట్లుగానే ఐపీఎల్‌ అనుభవం ఉన్న మరో ఆల్‌రౌండర్‌ డాన్‌ క్రిస్టియాన్‌ (రూ. 4.80 కోట్లు)ను కూడా తీసుకుంది. ఈ ముగ్గురు కాకుండా మరో ఐదుగురు భారత వర్ధమాన ఆటగాళ్లను కనీసం మొత్తం రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. సచిన్‌ బేబీ, రజత్‌ పటిదార్, మొహమ్మద్‌ అజహరుద్దీన్, సుయాష్‌ ప్రభుదేశాయ్‌లతో పాటు ఆంధ్ర జట్టు వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇంత మొత్తం చెల్లించినా... భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కబంతి కూడా వేయని జేమీసన్, గత కొన్నేళ్లుగా వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్‌ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఒక భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం బెంగళూరు చివరి వరకు ప్రయత్నించినా సరైన ఆటగాడు దక్కలేదు.

జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: కోహ్లి (కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్, మొహమ్మద్‌ సిరాజ్, నవదీప్‌ సైనీ, పవన్‌ దేశ్‌పాండే, షహబాజ్‌ అహ్మద్, వాషింగ్టన్‌ సుందర్, యజువేంద్ర చహల్, హర్షల్‌ పటేల్, సచిన్‌ బేబీ, రజత్‌ పటిదార్, మొహమ్మద్‌ అజహరుద్దీన్, సుయాష్‌ ప్రభుదేశాయ్, కోన శ్రీకర్‌ భరత్‌.

విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, డానియెల్‌ స్యామ్స్, ఫిన్‌ అలెన్, జేమీసన్, డాన్‌ క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్, ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్సన్‌.

సహాయక సిబ్బంది: మైక్‌ హెసన్‌ (డైరెక్టర్, క్రికెటర్‌ ఆపరేషన్స్‌), సైమన్‌ కటిచ్‌ (హెడ్‌ కోచ్‌), సంజయ్‌ బంగర్‌ (బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌), శ్రీధరన్‌ శ్రీరామ్‌ (బ్యాటింగ్‌ అండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌), ఆడమ్‌ గ్రిఫిత్‌ (బౌలింగ్‌ కోచ్‌).  

తుది జట్టు అంచనా/ఫామ్‌
మూడు–కోహ్లి, నాలుగు–డివిలియర్స్, ఐదు–మ్యాక్స్‌వెల్‌... భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్‌లు కాకుండా ఇన్నింగ్స్‌ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్‌మన్‌ అవసరం ఉన్న టీమ్‌ ఇప్పుడు ఆసీస్‌ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో పడిక్కల్‌కు తోడుగా ఫిన్‌ అలెన్‌ (కివీస్‌) బరిలోకి దిగవచ్చు.  నాలుగో విదేశీ ఆటగాడిగా జేమీసన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నా యి. రెండో ఓపెనర్‌గా కూడా భారత ఆటగాడి (అజహరుద్దీన్‌)కే అవకాశం ఇస్తే జంపా, రిచర్డ్సన్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. వేలం తర్వాత ఇలాంటి కూర్పులో కూడా ఆరో స్థానంలో ఒక భారత బ్యాట్స్‌మన్‌పైనే జట్టు ఆధారపడాల్సి వస్తోంది. మ్యాక్స్‌వెల్‌ విఫలమైతేనే క్రిస్టియాన్‌కు చాన్స్‌ లభిస్తుంది. స్పిన్నర్లుగా తుది జట్టులో చహల్, సుందర్‌ ఖాయం. సిరాజ్, సైనీలలో ఎవరికి ఎన్ని మ్యాచ్‌లు లభిస్తాయనేది చూడాలి.   

అత్యుత్తమ ప్రదర్శన
3 సార్లు రన్నరప్‌ (2009, 2011, 2016)
2020లో ప్రదర్శన: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడింది. లీగ్‌లో తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలిచి ఒక దశలో టాపర్‌గా నిలుస్తుందనుకున్న ఆర్‌సీబీ, వరుసగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఓడింది. చివరకు అతి కష్టమ్మీద నెట్‌రన్‌రేట్‌తో ముందంజ వేయగలిగింది. కోహ్లి తన స్థాయి మేరకు ఆడకపోవడం కూడా (15 ఇన్నింగ్స్‌లలో 121.35 స్ట్రయిక్‌రేట్‌తో 466 పరుగులు) జట్టు అవకాశాలపై ప్రభావం చూపించింది.

మరిన్ని వార్తలు