విరాట్‌ కోహ్లి @200

25 Oct, 2020 17:11 IST|Sakshi

దుబాయ్‌:  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 146 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ధాటి ఆరంభించారు. అయితే ఆర్సీబీ స్కోరు 31 పరుగుల వద్ద ఉండగా ఫించ్‌(15; 11 బంతుల్లో 3ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి పడిక్కల్‌(22; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా చేరడంతో ఆర్సీబీ 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో విరాట్‌ కోహ్లి-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

ఈ జోడి 82 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(39; 36 బంతుల్లో 4ఫోర్లు) ఔటయ్యాడు. దీపక్‌ చాహర్‌ వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఏబీ ఔటయ్యాడు. అటు తర్వాత మొయిన్‌ అలీ(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో సాంత్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక విరాట్‌ కోహ్లి మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు.  43 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌తో  50 పరుగులు చేశాడు. స్కోరును పెంచే క్రమంలో 19 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. ఆ ఓవర్‌ సామ్‌ కరాన్‌ వేయగా డుప్లెసిస్‌ క్యాచ్‌ తీసుకున్నాడు.దాంతో కోహ్లి ఇన్నింగ్స్‌ యాభై పరుగుల వద్ద ముగిసింది. ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించాడు. సాంత్నార్‌కు వికెట్‌ దక్కింది.

విరాట్‌ కోహ్లి @200
ఈ మ్యాచ్‌లో కోహ్లి సిక్స్‌ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు. రవీంద్ర జడేజా వేసిన 17ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చిన కోహ్లి సిక్స్‌ సాధించాడు. ఇదొక్క సిక్స్‌ మాత్రమే కోహ్లి ఈ మ్యాచ్‌లో కొట్టాడు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండొందల సిక్సర్లు కొట్టిన జాబితాలో కోహ్లి కూడా చేరిపోయాడు. ఐపీఎల్‌లో రెండొందలు, అంతకంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టిన జాబితాలో క్రిస్‌ గేల్‌(335), ఏబీ డివిలియర్స్‌(231), ఎంఎస్‌ ధోని(216), రోహిత్‌ శర్మ(209)లు వరుస స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు.

మరిన్ని వార్తలు