IPL 2022: కోహ్లి గోల్డెన్‌ డక్‌ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్‌ చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ

20 Apr, 2022 12:29 IST|Sakshi
Photo Courtesy: IPL

TSRTC MD Sajjanar Tweet Over Kohli Golden Duck Expression: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్ (తొలి బంతికే డకౌట్‌) అయిన విషయం తెలిసిందే.  కోహ్లి ఇలా ఔటయ్యాక పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చాలాకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న కోహ్లి లక్నోతో మ్యాచ్‌లోనైనా తిరిగి గాడిలో పడాలని భావించి, అది సాధ్యపడక నిర్వేదంతో పెట్టిన ఆ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌ను ట్రోల్‌ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్‌ చేస్తున్నారు. చాలామంది నెటిజన్ల లాగే కోహ్లి గోల్డెన్‌ డక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా స్పందించాడు. 


సజ్జనార్‌.. కోహ్లి హావభావాలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కోసం వాడేసుకున్నాడు. కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. కండక్టర్‌ గారు వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. మీ అనుభవాలను మాతో షేర్‌ చేసుకోండి అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయినా, కెప్టెన్‌​ డుప్లెసిస్‌ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/25) చెలరేగడంతో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.  


చదవండి: ఐపీఎల్‌ నిబంధన ఉల్లంఘన.. కేఎల్‌ రాహుల్‌కు భారీ జరిమానా

మరిన్ని వార్తలు