జాతీయ జట్టులో స్థానంపై కేకేఆర్‌ ఓపెనర్‌ ఆశాభావం

18 May, 2021 17:47 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఐపీఎల్‌ సహా దేశవాళీ క్రికెట్‌లోనూ విశేషంగా రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రాణా..  తన ప్రదర్శనే తనకు జతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడేందుకు జులైలో శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్న భారత జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న ఈ కేకేఆర్‌ ఓపెనర్‌.. గత మూడేళ్లుగా తన అటతీరు చాలా మెరుగుపడిందని, అందుకు తన గణాంకాలే నిదర్శమని, ఇవే తన అంతర్జాతీయ అరంగేట్రానికి తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్క ఆటగాడి కల అని, నేను కూడా భారత్‌ తరఫున రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నానని, సెలెక్షన్‌ కమిటీ నుంచి కాల్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాని పేర్కొన్నాడు.

భారత టెస్టు జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో లంక పర్యటన తనకు లభిం‍చిన సువర్ణావకాశమని ఈ 27 ఏళ్ల డాషింగ్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఢిల్లీ, కేకేఆర్‌ జట్ల తరఫున 67 మ్యాచ్‌ల్లో 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 1638 పరుగులు సాధించిన రాణా..38 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 40కి పైగా సగటుతో 2266 పరుగులు సాధించాడు. కాగా, భారత టెస్టు జట్టు సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో బిజీగా గడపనున్న నేపథ్యంలో వైట్‌ బాల్‌ స్పెషెలిస్ట్‌లను లంక పర్యటనకు పంపాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్‌, బుమ్రా లాంటి స్టార్ల గైర్హాజరీలో రాణా సహా చాలా మంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ అరంగేట్రంపై ఆశలు పెంచుకున్నారు. 
చదవండి: భారత మహిళల బ్యాటింగ్‌ కోచ్‌గా శివ్‌ సుందర్‌ దాస్‌..

మరిన్ని వార్తలు