నిజం చెపాలంటే ఆ మ్యాచ్‌ మాది కాదు

18 Oct, 2020 12:14 IST|Sakshi

చివరి 6 బంతుల్లో 4 సిక్సర్లు

దుబాయ్‌: రాజస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన అనంతరం బెంగుళూరు జట్టు కోచ్‌ సైమన్‌ కటిచ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయం రాజస్తాన్‌నే వరించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వరకు విజయవకాశాలన్నీ రాజస్తాన్‌ వైపే ఉన్నాయని పేర్కొన్నాడు. 12 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన తరుణంలో ఏబీ డివిలియర్స్‌ రెచ్చిపోయి ఆడటంతో తమ జట్టు గెలుపు ముంగిట నిలిచిందని చెప్పాడు. ‘28 పరుగులు చేసేందుకు 16 బంతులెదుర్కొన్న ఏబీడీ మరో 6 బంతుల్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. జయదేవ్‌ ఉనాద్కత్‌ వేసిన 19 ఓవర్లో వరసగా తొలి మూడు బంతులను  ఏబీడీ మిడ్‌ వికెట్, లాంగాన్, స్క్వేర్‌ లెగ్‌లో సిక్సర్లుగా మలిచగా.. ఐదో బంతికి గురుకీరత్‌ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి.
(చదవండి: హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్: ధనశ్రీ)

అప్పటివరకు లెగ్‌సైడ్‌ బంతులతో తక్కువ పరుగులే ఇచ్చిన ఉనాద్కత్‌ని రంగంలోకి దించి ఫలితం రాబడుదామనుకున్న కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. ఇక చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 10 పరుగులే అవసరమవడంతో ఏబీడీ పని సులువైంది. చివరి ఓవర్‌ నాలుగో బంతికి మరో సిక్సర్‌ కొట్టిన డివిలియర్స్ ఆర్సీబీకి ‌ఘన విజయాన్ని అందించాడు. ఏబీడీ గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మన్‌’ అని కటిచ్‌ ప్రశంసలు కురిపించాడు. ఇక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జోఫ్రా 19 వ ఓవర్‌ వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు.

‘అంతకు ముందు చక్కగా బౌలింగ్‌ చేసిన ఉనాద్కత్‌ ఆ ఓవర్‌ కూడా కాపాడుతాడని అనుకున్నా. అయితే, క్రీజులో ఉన్నది మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఏబీడీ. అందుకే ఆ ఓవర్‌ మా అవకాశాలను మార్చేసింది. అతనిలాగా మరే ఆటగాడు బంతిని స్టేడియం అన్ని వైపులా పరుగులెత్తించలేడు. అంత ఒత్తిడిలోనూ మెరుగైన బ్యాటింగ్‌తో ఏబీడీ మ్యాచ్‌ని మానుంచి లాగేసుకున్నాడు’అని స్మిత్‌ పేర్కొన్నాడు. కాగా, శనివారం రాత్రి రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు 7 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఏబీ డివిలియర్స్‌ (22 బంతుల్లో 55 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు)కి దక్కింది.
(చదవండి: బాల్‌ కోసం వెయిట్‌ చేస్తూ ప్రాణాలతో చెలగాటం)

మరిన్ని వార్తలు