'సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే'

15 May, 2021 15:52 IST|Sakshi

లండన్‌: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిపై కలత చెందిన టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి తనవంతు చేయూతను అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇతర క్రికెటర్ల లాగా విరాళంతో సరిపెట్టకుండా కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. 

విహారి చేస్తున్న పనిపై అందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఒక నెటిజన్‌ మాత్రం విహారిపై వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. విషయంలోకి వెళితే.. విహారి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఒక అమ్మాయి అవసరం గురించి రాసుకొచ్చాడు.''ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ చావుబతుకులు మధ్య ఉన్నారు. వారిని కాపాడుకోవడానికి అమ్మాయికి డబ్బు అవసరం చాలా ఉంది. అందరం కలిసి తలా ఒక చేయి వేసి వారి ప్రాణాలను కాపాడుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

విహారి కామెంట్స్‌పై అందరు పాజిటివ్‌గా స్పందించారు. అయితే ఒక వ్యక్తి మాత్రం..'' ఆ డబ్బు మీరే ఇవ్వొచ్చు కదా.. ఎంతైనా మీరు గొప్ప అథ్లెట్‌.. డబ్బులు కూడా చాలానే ఉంటాయి.. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై విహారి ఆ వ్యక్తికి ధీటుగా బదులిచ్చాడు. ''ఇది నిజంగా సిగ్గుచేటు.. ఇండియా ఈరోజు ఇలా ఉందంటే నీలాంటి వాళ్లు  దేశంలో నివసించడం వల్లే.. రియల్లీ షేమ్ ఆన్‌ యూ.. వీలైతే సాయం చేయాలి. అంతేకానీ ఇలాంటి మాటలొద్దు.. నా దగ్గర డబ్బు ఉండొచ్చు.. కానీ నేను ఏదో ఆశించి స్వార్థం కోసం చేయడం లేదు.. దేశం కోసం చేస్తున్నా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఇప్పటివరకు టీమిండియా తరపున 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్‌షైర్‌ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్‌ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం జూన్‌ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది.  
చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్‌...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు