ENG Vs PAK: పిచ్చ కొట్టుడు కొట్టారు.. డీఆర్‌ఎస్‌ కూడా లేకపాయే!

1 Dec, 2022 18:00 IST|Sakshi

పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంగ్లండ్‌ తొలి టెస్టులోనే అదరగొట్టే ప్రదర్శన ఇస్తుంది. మ్యాచ్‌ తొలి రోజునే ఇంగ్లండ్‌ బ్యాటర్లు పాక్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది.

ఇక తొలి టెస్టుకు డీఆర్‌ఎస్‌ లేకపోవడంతో పాకిస్తాన్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఎల్బీల విషయంలో డీఆర్‌ఎస్‌ లేకపోవడంతో పాక్‌ జట్టు తెగ ఇబ్బంది పడింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ను నసీమ్‌ షా వేశాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడో ఓవర్‌ బౌలింగ్‌కు వచ్చిన నసీమ్‌ షా ఒక మంచి డెలివరీ వేశాడు. బంతి జాక్‌ క్రాలీ ప్యాడ్లకు తాకింది.

అయితే థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేస్తే ఔటయ్యే అవకాశాలున్నాయి. కానీ పాకిస్తాన్‌ మాత్రం డీఆర్‌ఎస్‌కు వెళ్లలేకపోయింది. ఏవో సాంకేతిక సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు డీఆర్‌ఎస్‌ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్‌ డీఆర్‌ఎస్‌ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చూసిన అభిమానులు పీసీబీని ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. 

ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తన ఇన్నింగ్స్‌ను ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో కొనసాగించడం విశేషం. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోయారు. తొలుత ఓపెనర్లు జాక్‌ క్రాలీ(122 పరుగులు), బెన్‌ డకెట్‌(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్‌ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ప్రస్తుతం హ్యారీ బ్రూక్‌(81 బంతుల్లోనే 101 నాటౌట్‌) సూపర్‌ ఫాస్ట్‌తో బ్యాటింగ్‌ కొనసాగిస్తుండగా.. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

ఇక పాకిస్తాన్‌ బౌలర్లంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జునైన్‌ మహమూద్‌ 23 ఓవర్లు వేసి ఏకంగా 160 పరుగులు ఇచ్చుకోవడం విశేషం. నసీమ్‌ షా కూడా 15 ఓవర్లలో 96 పరుగులిచ్చి ఒక వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

చదవండి: టెస్ట్‌ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్‌ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు

మరిన్ని వార్తలు