టీమిండియా క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లకు కారణం అదేనా..?

15 Sep, 2022 15:41 IST|Sakshi

ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్లు వరుస పెట్టి రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న అంశంపై క్రికెట్‌ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే భారత ఆటగాళ్లు రాహుల్‌ శర్మ, సురేశ్‌ రైనా, ఈశ్వర్‌ పాండే, తాజాగా రాబిన్‌ ఉతప్ప భారత క్రికెట్‌తో బంధం తెంచుకున్న విషయం విధితమే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ క్రికెటర్లు, వయసు ఏమంత పైబడనప్పటికీ  వరుసగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాలు విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది వీరందరి అభిమతంగా తెలుస్తోంది. క్రికెట్‌ ఆడేందుకు శరీరం సహకరిస్తున్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో అనుబంధమున్న ఏ ఆటగాడూ ఇతర దేశాల క్రికెట్‌ లీగ్స్‌లో కానీ మరే ఇతర క్రికెట్‌ బోర్డుల ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో కానీ పాల్గొనే వీలు లేదు. ఈ నిబంధనే వయసు, టాలెంట్‌ ఉన్న చాలా మంది భారత క్రికెటర్లకు ప్రాణసంకటంలా మారింది. యువ క్రికెటర్లైతే ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడే అవకాశం రాకపోదా అన్న ఆశతో భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకునే సాహసం చేయలేకపోతుంటే.. వయసు పైబడిన ఆటగాళ్లు మాత్రం బీసీసీఐని నమ్ముకుంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న చందంగా తమ బతుకులు మారతాయని ఇష్టం లేకపోయినా భారత క్రికెట్‌తో అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. 

ఇలా బీసీసీఐతో బంధం తెంచుకున్న వారికి దేశవాళీ క్రికెట్‌లో కానీ, జాతీయ జట్టుకు కానీ, బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్‌లో కానీ ఆడే అవకాశాలు రాకపోయినా భారీ ధన ప్రవాహం నడిచే ఇతర దేశాల క్రికెట్‌ లీగ్స్‌లో ఆడే ఛాన్స్‌ ఉంటుంది. ఇటీవల భారత​ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వారంతా ఈ కారణంగానే బీసీసీఐతో బంధం తెంచుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ లీగ్స్‌ పుట్టుకొచ్చాయి. వీటికి ప్రస్తుతం భారీ గిరాకీ ఉంది. ఐపీఎల్‌ అంత కాకపోయినా ఆ రేంజ్‌లో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కొన్ని ఫ్రాంచైజీలు పర్సులు రెడీ చేసుకుంటున్నాయి.    

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఈసీబీ ఆధ్వర్యంలో నడిచే హండ్రెడ్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బంగ్లాదేశ్‌ లీగ్‌, శ్రీలంక క్రికెట్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఇలా ప్రతి ఐసీసీ అనుబంధ దేశంలో ఓ లీగ్‌ జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో రెండు లీగ్‌లు (యూఏఈ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌) ప్రారంభంకానున్నాయి. ఆటగాళ్లు ఈ లీగ్స్‌లో ఏదో ఒక లీగ్‌లో సక్సెస్‌ అయితే డబ్బుతో పాటు ఏడాదంతా ఖాళీ లేకుండా క్రికెట్‌ ఆడే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రారంభంకాబోయే యూఏఈ, సౌతాఫ్రికా లీగ్‌ల్లోని ఫ్రాంచైజీలను దాదాపుగా ఐపీఎల్‌ యాజమాన్యాలే కొనుగోలు చేయడంతో భారత వెటరన్‌ క్రికెటర్ల ఫోకస్‌ అంతా వీటిపైనే ఉంది. 

మరిన్ని వార్తలు