పసికూనలు చెలరేగుతున్న వేళ, టీమిండియాకు ఎందుకీ దుస్థితి..?

8 Sep, 2022 11:55 IST|Sakshi

క్రికెట్‌ పసికూనలుగా పరిగణించబడే శ్రీలంక,​ ఆఫ్ఘనిస్తాన్‌, జింబాబ్వే లాంటి చిన్న జట్లు అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా రాణిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న వేళ, టీమిండియా లాంటి ప్రపంచ స్థాయి జట్టు తమకంటే తక్కువ స్థాయి జట్ల చేతుల్లో  ఓటమిపాలవుతూ అవమానాల పాలవుతుందన్నది కాదనలేని సత్యం. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌, శ్రీలంక చేతుల్లో భంగపడి టోర్నీ నుంచి నిష్క్రమించడమే ఇందుకు నిదర్శనం.

ఈ టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు అద్భుత ప్రదర్శనలతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల మన్ననలు అందుకుంటుంటే.. టీమిండియా మాత్రం ఇతర జట్ల జయాపజాయాలపై ఆధారపడి ఫైనల్‌ బెర్తు కోసం ఎదురుచూసిం‍ది. టీమిండియా పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది. అసలు టీమిండియాకు ఏమైంది..?

కారణాలు విశ్లేషిస్తే.. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు, టీమిండియా ఈ దుస్థితికి కూడా ఇంచుమించు అన్నే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే.. మొదటిది బీసీసీఐ అతి జోక్యం. భారత క్రికెట్‌ బోర్డు ఇటీవలి కాలంలో జట్టు ఎంపిక, ఇతరత్రా వివాదాలు (కోహ్లి కెప్టెన్సీ), తుది జట్టు కూర్పు.. ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని పెత్తనం చలాయిస్తుంది. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నికైన నాటి నుంచి భారత జట్టులో వీరి జోక్యం మరింత అతిగా మారింది. 


ప్రతి చిన్న విషయంలోనూ వీరిద్దరు కలగజేసుకోవడం, జట్టులో గ్రూపులు కట్టడం (రోహిత్‌, కోహ్లి), ఆటగాళ్లపై విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అప్లై చేయడం, కోచ్‌ను చెప్పుచేతల్లో పెట్టుకోవడం, తమ ఆధ్వర్యంలో నడిచే ఐపీఎల్‌ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలను దెబ్బకొట్టడం, ఆటగాళ్ల ఇష్టాఅయిష్టాలతో పని లేకుండా రెస్ట్‌ పేరుతో పక్కకు పెట్టడం, ఆటగాళ్లు రాణిస్తున్నా కారణం లేకుండా పక్కకు పెట్టడం, రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉన్నా వారికి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం, సీనియర్లు పదే పదే విఫలమవుతున్నా వరుస అవకాశాలు ఇవ్వడం, తరుచూ కెప్టెన్లను, ఓపెనర్లను మార్చడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో బీసీసీఐ అనవసరంగా తలదూరుస్తూ జట్టు ఇలా తయారవ్వడానికి కారణమైంది. 


టీమిండియా ఇలా తయారవ్వడానికి బోర్డు అతి జోక్యమొక్కటే కారణం కాదు. కొందరు సీనియర్లు సైతం పెద్దల అండదండలతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ, జాతీయ జట్టు ప్రయోజనాలు గాలికొదిలేస్తుండటం కూడా మరో కారణమని చెప్పాలి. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా, కేఎల్‌ రాహుల్‌ లాంటి సీనియర్లు ఏ సిరీస్‌ ఆడతారో, ఏ సిరీస్‌ నుంచి తప్పుకుంటారో ఎవరికీ అర్ధం కాని విషయం. వీరు ఏ వ్యక్తిగత కారణాల చేతనో తప్పుకున్న తర్వాత బోర్డు తాపీగా ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి గాయం లేదా రెస్ట్‌ అనే కుంటి సాకులు చూపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే ఈ సో కాల్డ్‌ సీనియర్లు ఐపీఎల్‌ సమయంలో ఇలా జట్టు నుంచి తప్పుకునే సాహసం చేయరు. 

ఎందుకంటే, ఈ పేద క్రికెటర్లకు అన్నం పెట్టే అక్ష్యయపాత్ర అదే కాబట్టి. ఐపీఎల్‌ కోసం ఇంతలా తాపత్రయపడే క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడాల్సి వచ్చేసరికి లేని పోని కారణాలు తెరపైకి తెచ్చి జారుకుంటారు. జాతీయ జట్టుకు ఆడటాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని సీనియర్లు.. జట్టులో స్థానం గల్లంతవుతుందని అనుకుంటే అప్పుడు కూడా వ్యక్తిగత ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప.. జట్టు గెలుపోటములతో మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తారు. ఎంతో నైపుణ్యం కలిగిన భారత క్రికెటర్లను ఇకనైనా దారికి తేవాలంటే, తొలుత ఐపీఎల్‌ను నియంత్రించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో లభించే నడిమంత్రపు సిరి కోసం, ఎండార్స్‌మెంట్ల రూపంలో వచ్చే ఈజీ మనీ కోసం భారత క్రికెటర్లు ఆశపడి దేశ ప్రయోజనాలను గాలికొదిలేస్తున్నారన్నది వీరి భావన.


భారత జట్టు ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మరడానికి మరో కారణం కూడా ఉంది. జట్టు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఘెర వైఫల్యం. కోచ్‌గా ఎంపికైన మొదట్లో అందరికీ అవకాశాలు కల్పిస్తానని ప్రగల్భాలు పలికిన ఆయన.. బోర్డు అపరిమిత జోక్యం కారణంగా ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోలేకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో తుది జట్టు ఎంపికలో నెలకొన్న గందరగోళమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ద్రవిడ్‌ ఒకరిన ఆడించాలని భావిస్తే.. బోర్డు మరోకరిని రెకమెండ్‌ చేస్తుంది. సూపర్‌-4 దశలో వికెట్‌కీపర్‌ స్థానం విషయంలో, గాయపడ్డ జడేజా స్థానం విషయంలో ద్రవిడ్‌ చాలా మదనపడినట్లు సమాచారం. 


కెప్టెన్‌ ఓవరాక్షన్‌..
రోహిత్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా మారాక టీమిండియాను వరుస విజయాల (చిన్న జట్లపై) బాట పట్టిస్తున్నప్పటికీ.. ప్రవర్తన విషయంలో మాత్రం హిట్‌మ్యాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బోర్డు సపోర్ట్‌ భారీగా ఉండటంతో అతను పట్టపగ్గాలు లేకుండా సహచరులతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ విమర్శలపాలవుతున్నాడు. ఒకప్పుడు కోహ్లిదే ఓవరాక్షన్‌ అనుకున్న అభిమానులు, సహచర ఆటగాళ్లు.. ప్రస్తుతం రోహిత్‌ ప్రవర్తన చూసి నివ్వెరపోతున్నారు. కోహ్లితో పోలిస్తే రోహిత్‌ ఓవరాక్షన్‌ రెట్టింపైందని గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల పంత్‌, హార్ధిక్‌, అర్షదీప్‌లతో అతను వ్యవహరించిన తీరు బాధాకరమని వాపోతున్నారు. 


ఇలా టీమిండియా దుస్థితికి కారణాలు విశ్లేషిస్తూ పోతే అంతమే ఉండదు. భారత క్రికెట్‌ బోర్డు ఇకనైనా మేల్కొని పై లోపాలనైనా సరిదిద్దుకుంటే మున్ముందు టీమిండియా పూర్వవైభవం సాధించే అవకాశం ఉంది. ఓ పక్క శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న చిన్న దేశాలు రకరకాల సంక్షోభాల్లో కొట్టిమిట్టాడుతూనే అంతర్జాతీయ వేదికలపై రాణిస్తుంటే.. టీమిండియా మాత్రం అన్ని ఉండి ఐదో తనం తక్కువైందన్న రీతిలో వ్యవహరిస్తుంది. త్వరలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌లోనైనా టీమిండియా తలరాత మారాలని ఆశిద్దాం. 
చదవండి: 'టి20 ప్రపంచకప్‌కు 95శాతం జట్టు రెడీ'.. రోహిత్‌పై విమర్శలు

మరిన్ని వార్తలు