ఐపీఎల్‌-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!

28 Mar, 2023 21:50 IST|Sakshi

మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం.

ఐపీఎల్‌లో అత్యధిక​ వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్‌ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యుజ్వేంద్ర చహల్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్‌ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్‌లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్‌ అవుతుంది.

అత్యధిక సెంచరీలు: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్‌ బాస్‌ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్‌ఆర్‌ జోస్‌ బట్లర్‌, ఆర్సీబీ విరాట్‌, పంజాబ్‌ రాహుల్‌, ఢిల్లీ వార్నర్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసేందుకు రెడీగా ఉన్నారు.

అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్‌లో ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న సెకెండ్‌ హైయ్యెస్ట్‌ సిక్సర్స్‌ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్‌ శర్మ (240) బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్‌ గేల్‌ (357) ఉన్నాడు. 

అత్యధిక డక్స్‌: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రానున్న సీజన్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్‌ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్‌దీప్‌ సింగ్‌ (14)ను అధిగమించి హోల్‌ అండ్‌ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్‌ అవుతాడు.

ఇవే కాకుండా రానున్న సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే..

అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్‌కే సారధి ఎంఎస్‌ ధోని రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు.

అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ రానున్న సీజన్‌లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్‌ ఖాతాలో 6244 రన్స్‌ ఉన్నాయి. అలాగే వార్నర్‌ (5881), రోహిత్‌ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్‌లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్‌ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్‌ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్‌ రైనా (109) పేరిట ఉంది. 

 
 

మరిన్ని వార్తలు