WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..!

2 Jun, 2023 17:20 IST|Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 చివరి అంకానికి చేరింది. జూన్‌ 7-11 మధ్యలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ సీజన్‌ ముగుస్తుంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఈ సీజన్‌ అత్యుత్తమ గణాంకాలపై ఓ లుక్కేస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆసీస్‌తో పాటు ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఏ ఒక్క విభాగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చనప్పటికీ ఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ఈ సీజన్‌తో అత్యధిక పరుగుల విభాగంలో ఇంగ్లండ్‌ జో రూట్‌ (22 మ్యాచ్‌ల్లో 1915 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. అత్యధిక వికెట్ల జాబితాలో ఆసీస్‌ నాథన్‌ లయోన్‌ (19 మ్యాచ్‌ల్లో 83 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక డిస్మిసల్స్‌ రికార్డు (19 మ్యాచ్‌ల్లో 62 డిస్మిసల్స్‌) ఆసీస్‌ వికెట్‌కీపర్‌ ఆలెక్స్‌ క్యారీ పేరిట ఉండగా.. అత్యధిక స్కోర్‌ రికార్డు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ (252) పేరిట నమోదై ఉంది.

బౌలింగ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (10/119) పేరిట ఉండగా.. మ్యాచ్‌లోనూ అత్యుత్తమ గణాంకాల రికార్డు (14/225) అజాజ్‌ పేరిటే నమోదై ఉంది. అత్యధిక సగటు కివీస్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (75.20), అత్యధిక టీమ్‌ టోటల్‌ ఇంగ్లండ్‌ (657), అత్యల్ప టీమ్‌ టోటల్‌ బంగ్లాదేశ్‌ (53) పేరిట నమోదై ఉన్నాయి. అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (378/3) ఇంగ్లండ్‌ పేరిట ఉంది. 

ఇలా.. 2021-23 సీజన్‌లో ఏ విభాగంలో చూసినా.. ఇతర జట్లు, ఆటగాళ్లే ఉన్నారు తప్పించి, భారత జట్టు కానీ ఆటగాళ్ల జాడ కానీ కనిపించలేదు. అయినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (ఫైనల్‌కు ముందు) టీమిండియా రెండో స్థానంలో నిలిచింది.

టీమిండియా ఆటగాళ్ల జాడ కోసం వెతికితే.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 19 (పుజారా), ఆతర్వాతి స్థానాల్లో.. అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో మూడో స్థానంలో (అశ్విన్‌ 61 వికెట్లు).. అత్యధిక డిస్మిసల్స్‌ చేసిన వికటె్‌కీపర్ల జాబితాలో నాలుగో స్థానంలో (పంత్‌, 50 డిస్మిసల్స్‌) తారసపడ్డారు. 

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఆటగాళ్లు..
19. పుజారా (16 మ్యాచ్‌ల్లో  887 పరుగులు)
22. విరాట్‌ కోహ్లి (16 మ్యాచ్‌ల్లో 869)
23. పంత్‌ (12 మ్యాచ్‌ల్లో 868)
32. రోహిత్‌ శర్మ (10 మ్యాచ్‌ల్లో 700)
34. రవీంద్ర జడేజా (12 మ్యాచ్‌ల్లో 673)
35. శ్రేయస్‌ అయ్యర్‌ (10 మ్యాచ్‌ల్లో 666)
36. కేఎల్‌ రాహుల్‌ (11 మ్యాచ్‌ల్లో 636)
48. శుభ్‌మన్‌ గిల్‌ (7 మ్యాచ్‌ల్లో 476)
 

    

మరిన్ని వార్తలు