ఫ్రాంచైజీ ఫీజును తగ్గించండి

1 Aug, 2020 02:17 IST|Sakshi

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ నిర్వాహకులను కోరిన జట్లు

న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను కరోనా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లీగ్‌లోని ప్రతి జట్టు కూడా సీజన్‌కు రూ.30 కోట్ల మేర నష్టపోతున్న వేళ... కరోనా రూపంలో వారిపై మరింత   ఆర్థిక భారం పడనుంది. దాంతో దీని నుంచి కాస్తలో కాస్త తప్పించుకోవడానికి లీగ్‌లో ఆడే అన్ని జట్లు కూడా ఒక ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. ఈ ఏడాదికిగాను జట్లు చెల్లించే ఫ్రాంచైజీ ఫీజును తగ్గించాలంటూ లీగ్‌ నిర్వాహకులను, ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌డీఎల్‌)ను అభ్యర్థించాయి.

ప్రస్తుతం ప్రతి జట్టు కూడా సీజన్‌కు రూ. 13 నుంచి 16 కోట్లను ఫ్రాంచైజీ రుసుముగా చెల్లిస్తున్నట్లు సమాచారం. 2014లో ఎనిమిది జట్లతో ఘనంగా ఆరంభమైన ఐఎస్‌ఎల్‌... ప్రస్తుతం పది జట్లకు చేరింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఐపీఎల్‌ తర్వాతి స్థానంలో నిలిచినా... తాము ఇప్పటి వరకు లాభాలను కళ్ల చూడలేదని జట్ల యాజమానులు చెబుతున్నారు. కరోనా దెబ్బతో తమకు స్పాన్సర్లు కూడా దూరమయ్యే అవకాశం ఉందని ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఫీజుపై లీగ్‌ నిర్వాహకులు ఈ నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు