PAK VS ENG 3rd Test: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రెహాన్‌ అహ్మద్‌ అరుదైన రికార్డు

17 Dec, 2022 14:11 IST|Sakshi

Rehan Ahmed: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అరంగేట్రం చేయడం ద్వారా ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రెహాన్‌ అహ్మద్‌ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా రెహాన్‌ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌.. 18 ఏళ్ల 126 రోజుల వయసులో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్‌ క్లోజ్‌ పేరిట ఉంది.

క్లోజ్‌.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన రెహాన్‌ పాకిస్తాన్‌ సంతతికి చెందిన వాడు. కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రెహాన్‌.. గత కౌంటీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి ఇంగ్లండ్‌ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రెహాన్‌.. ఇంగ్లండ్‌ తరఫున ఇదివరకే టీ20 అరంగేట్రం చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఇంగ్లండ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 17) ప్రారంభమైన మూడో టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 35 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (8) తక్కువ స్కోర్‌కే ఔట్‌ కాగా.. షాన్‌ మసూద్‌ (30), అజహార్‌ అలీ (45) పర్వలేదనిపించారు. బాబర్‌ ఆజమ్‌ (43), సౌద్‌ షకీల్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓలీ రాబిన్సన్‌, జాక్‌ లీచ్‌, మార్క్‌ వుడ్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. అరంగేట్రం ఆటగాడు రెహాన్‌ అహ్మద్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు.  ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు