IPL 2023: రిలయన్స్‌ మరో సంచలన నిర్ణయం.. మొన్న సౌతాఫ్రికా లీగ్‌, ఇప్పుడు ఐపీఎల్‌!

13 Jan, 2023 15:17 IST|Sakshi

FIFA World Cup 2022- SA20 2023- IPL 2023:ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! ఐపీఎల్‌-2023 సీజన్‌ మ్యాచ్‌లను ఎలాంటి ప్రత్యేకమైన ఫీజు లేకుండానే డిజిటల్‌ మాధ్యమంలో చూసే అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్‌ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌-18 రూ. 23, 758 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోసినిమా యాప్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఫిఫా, సౌతాఫ్రికా లీగ్‌
ఇటీవల ముగిసిన సాకర్‌ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్‌కప్‌-2022ను ఇప్పటికే జియో సినియా యాప్‌లో విజయవంతంగా ప్రసారం చేశారు. టీవీ ఛానెళ్లు స్పోర్ట్స్‌ 18, స్పోర్ట్స్‌18 హెచ్‌డీలో ప్రేక్షకులు ఈ ఫుట్‌బాల్‌ సమరాన్ని వీక్షించగా.. డిజిటల్‌ యూజర్లకు జియో సినిమాలో ఈ వెసలుబాటు దక్కింది. మరోవైపు.. జనవరి 10న మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ మ్యాచ్‌లను జియో సినిమాలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 

ఇదే తరహాలో ఐపీఎల్‌-2023ని కూడా జియో సినిమా యాప్‌లో ప్రసారం చేసేందుకు వయాకామ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ది హిందూ బిజినెస్‌లైన్‌ కథనం పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను డిజిటల్‌ మీడియాలో ఫ్రీగా ప్రసారం చేసిన తొలి సంస్థగా రిలయన్స్‌ మరో సంచలనానికి నాంది పలికినట్లవుతుంది. అంతేగాక.. టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్‌ గ్రూప్‌నకు భారీ షాకిచ్చినట్లవుతుంది.

మరిన్ని వార్తలు