కోహ్లికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!

20 Jan, 2022 21:40 IST|Sakshi

సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా టెస్టు సిరీస్‌ కోల్పోయిన తర్వాత విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఒక సీనియర్‌ ప్లేయర్‌గా జట్టుకు అందుబాటులో ఉంటానని.. ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇప్పుడంటే కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు కాబట్టి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

చదవండి: Kohli VS Bavuma: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?

కానీ ఇదే కోహ్లి.. సౌతాఫ్రికా టూర్‌ బయలుదేరడానికి  ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐతో పాటు గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదమే. ఈ వివాదం ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్డే కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని... కెప్టెన్‌గా తప్పుకోవద్దంటూ గంగూలీ తనను అడగలేదంటూ కోహ్లి కుండబద్దలు కొట్టాడు. దీంతో బీసీసీఐకి, కోహ్లికి.. పరోక్షంగా గంగూలీతో వివాదం తారాస్థాయికి చేరిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో భారత మాజీ క్రికెటర్లు జోక్యం చేసుకొని .. కోహ్లి ఆటపై దృష్టి పెట్టాలని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది.

చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా?

తాజాగా దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్‌ గంగూలీ షోకాజ్‌ నోటీసు ఇవ్వబోయాడని కొందరు క్రీడా పండితులు పేర్కొన్నారు. అయితే బీసీసీఐ బోర్డులో ఒక సభ్యుడి ఒత్తిడితో గంగూలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇండియా హెడ్‌న్యూస్‌ రిపోర్ట్స్‌ ప్రకారం గంగూలీ.. కోహ్లికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడానికి డ్రాఫ్ట్‌ లెటర్‌ కూడా తయారు చేశాడని.. కానీ బోర్డు సభ్యుడు ఒకరు అడ్డుపడడంతో గంగూలీ ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమై.. గంగూలీ కోహ్లికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని క్రీడా పండితులు పేర్కొన్నారు.

చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ..!

మరిన్ని వార్తలు