IPL 2021: ‘బయో బబుల్‌లో ఉన్నాం.. టీకా ఎందుకు అను​కున్నారు’

15 May, 2021 11:40 IST|Sakshi
Cortesy: IPL

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా గతేడాది ప్రత్యక్షంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చూసే అవకాశం లేకపోయినా టీవీలోనైనా వీక్షించి ఆనందించారు క్రికెట్‌ ప్రేమికులు. భారత్‌లో పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఈఏకి మార్చిన బీసీసీఐ.. ఐపీఎల్‌-2020ను విజయవంతంగా పూర్తి చేసి వారికి వినోదాన్ని అందించింది. అయితే, 14వ సీజన్‌కు వచ్చే సరికి సీన్‌ మారింది. ఈసారి స్వదేశంలోనే క్యాష్‌ రిచ్‌లీగ్‌ నిర్వహించారు. కానీ, బయో బబుల్‌లో ఉన్నా ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021కు మధ్యలోనే బ్రేక్‌ పడింది. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, విదేశాల్లో మిగతా షెడ్యూల్‌ పూర్తి చేద్దామనుకున్నప్పటికీ పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ కనిపించడం లేదు.

ముఖ్యంగా సన్‌రైజర్స్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహాకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం, కేకేఆర్‌ క్రికెటర్‌ ప్రసిద్‌ కృష్ణ ఇంకా హోంక్వారంటైన్‌లోనే ఉండాల్సి రావడం సహా విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు తరలివెళ్లడం వంటి అంశాలు అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మరోసారి అందరినీ ఒకేచోటకు చేర్చడం, బయె బబుల్‌ నిబంధనలు పక్కాగా అమలు అయ్యేలా చూడటం అంత తేలికేం కాదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయిద్దామని ఫ్రాంఛైజీలు భావించినా, పలువురు క్రికెటర్లు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. 

వ్యాక్సిన్‌ వేయించుకుంటే బాగుండేదేమో!
‘‘చాలా మంది ఆటగాళ్లు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఇష్టపడలేదు. నిజానికి అది వారి తప్పు కాదు. టీకాపై అవగాహన లేకపోడం మాత్రమే. ఇంకొంత మంది మాత్రం.. బయో బబుల్‌లో సురక్షితంగా ఉన్నాం కదా. వ్యాక్సిన్‌తో పనేంటి అనుకున్నారు. దీంతో, ఫ్రాంఛైజీలు కూడా వారిని మరీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఫలితంగా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చార్టర్‌ ఫ్లైట్లలో ప్రయాణాలు చేసినప్పటికీ ఇతర సిబ్బంది కూడా మాతోనే ఉంటారు కదా. వారి కోవిడ్‌ స్టేటస్‌ ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు ఎవరికి ఎప్పుడు వైరస్‌ సోకిందో చెప్పడం కష్టం’’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే, విదేశీ క్రికెటర్లు, సిబ్బంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపినా, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వారికి వ్యాక్సినేషన్‌ చేయలేకపోయామని తెలిపినట్లు వెల్లడించింది. 

కాగా సాహా, ప్రసిద్‌ కృష్ణ మే 25న ముంబైలో నిర్వహించే మూడు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్‌ వస్తే మాత్రమే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వారికి చా​న్స్‌ ఉంటుంది. లేదంటే మేజర్‌ టోర్నీపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇక ఐపీఎల్‌ వాయిదా పడిన తర్వాత పలువురు టీమిండియా ఆటగాళ్లు టీకా వేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, పుజారా, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు.

చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్‌...

మరిన్ని వార్తలు