Anil Kumble: కొత్త కోచ్‌ వేటలో పంజాబ్‌ కింగ్స్‌.. కుంబ్లేకు మంగళం పాడనుందా!

19 Aug, 2022 10:51 IST|Sakshi

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్‌ కింగ్స్‌ ​కోచ్‌గా అనిల్‌ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్‌ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒ‍ప్పందాన్ని రెన్యువల్‌ చేసుకునేందుకు పంజాబ్‌ కింగ్స్‌ ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కోచ్‌ పదవికి ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్‌ సహా హైదరాబాద్‌ మాజీ కోచ్‌ ట్రెవర్‌ బెలిస్‌ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్‌ కొత్త కోచ్‌ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్‌ని నియమించుకునేందుకు పంజాబ్‌ కింగ్స​ ప్రయత్నాలు చేస్తోంది.

కాగా ఐపీఎల్‌ ప్రారంభం నుంచి పంజాబ్‌ కింగ్స్‌ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్‌లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్‌ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్‌ కింగ్స్‌. వేలంలో శిఖర్‌ ధావన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జానీ బెయిర్‌ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిపోవడంతో.. శిఖర్‌ ధావన్‌ను కాదని మయాంక్‌ అగర్వాల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్‌ తన బ్యాటింగ్‌ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్‌లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్‌ కింగ్స్‌ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్‌ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్‌ రాకతో పంజాబ్‌ కింగ్స్‌ దశ వచ్చే సీజన్‌లోనైనా మారుతుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు