Team India Coach: రాహుల్‌ ద్రవిడ్‌ ఒప్పేసుకున్నారు.. ఇకపై హెడ్‌ కోచ్‌గా?!

16 Oct, 2021 10:20 IST|Sakshi

Rahul Dravid Set To Take Over As Team India Coach: టీమిండియా అభిమానులకు బిగ్‌ అప్‌డేట్‌.  భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించినట్లు సమాచారం. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా ఎంతో మంది మెరికల్లాంటి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన ద్రవిడ్‌... ఇకపై టీమిండియాకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ పదవి చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా.. ద్రవిడ్‌ను ఒప్పించినట్లు సమాచారం.

ఈ మేరకు..‘‘టీమిండియా తదుపరి హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించారు. త్వరలోనే ఎస్‌సీఏ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ‘‘టీమిండియా యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇప్పుడిప్పుడే రూపాంతరం చెందుతోంది.

ఇలాంటి సమయంలో... ఎన్‌సీఏ హెడ్‌గా వాళ్లతో మమేకమైన ద్రవిడ్‌.. హెడ్‌ కోచ్‌గా ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అందుకే జై షా, గంగూలీ రంగంలోకి దిగారు. ద్రవిడ్‌కు నచ్చజెప్పారు. ఆయన ఒప్పుకొన్నారు. ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ కొనసాగుతారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ కథనం ప్రచురించింది. 

కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్‌ కుంబ్లే సహా పలువురు విదేశీ మాజీ ఆటగాళ్ల పేర్లు తెరమీదకు వచ్చినా... రాహుల్‌ ద్రవిడ్‌ వైపే బీసీసీఐ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి స్థానాన్ని ద్రవిడ్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

చదవండి: IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
Ind Vs NZ Series: న్యూజిలాండ్‌ సిరీస్‌కు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!

మరిన్ని వార్తలు