Virat Kohli: రోహిత్‌ను తొలగించి.. రాహుల్‌, పంత్‌కు అవకాశం ఇవ్వమన్న కోహ్లి!?

17 Sep, 2021 11:42 IST|Sakshi

Virat Kohli- Rohit Sharma: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతూ తీసుకున్న అనూహ్య నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మొత్తానికి కాకుండా వన్డేను మినహాయించి.. కేవలం పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఐసీసీ మెగా ఈవెంట్లైన చాంపియన్స్‌ ట్రోఫీ- 2017, వన్డే వరల్డ్‌ కప్‌-2019(సెమీస్‌లోనే తిరుగుముఖం), వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌-2021 సాధించడంలో కోహ్లి సేన విఫలం కావడం ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీకి నేతృత్వం వహిస్తున్న కోహ్లి.. ఇంతవరకు టైటిల్‌ సాధించలేకపోవడంపై విమర్శలు కూడా టీ20 కెప్టెన్సీపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా... కోహ్లి తన నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో తదుపరి టీ20 కెప్టెన్‌ ఎవరా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకు ప్రమోషన్‌ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, కోహ్లి, హిట్‌మ్యా్న్‌ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌, టీ20లలో తన డిప్యూటీగా రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాలని కోహ్లి మేనేజ్‌మెంట్‌నను కోరాడన్నది దాని సారాంశం. 

రోహిత్‌ శర్మ వయస్సు(34) దృష్ట్యా అతడిని వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ కోహ్లి ఈ మేరకు సెలక్షన్‌ కమిటీకి సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాక.. ఆరు నెలల చర్చ తర్వాతే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బీసీసీఐ- కోహ్లి మధ్య విభేదాలున్నాయనే వార్తలకు బలం చేకూరుతోంది.

మరోవైపు.. ‘‘యూఏఈలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో జట్టు మెరుగైన ప్రదర్శన కనబరచపోతే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ పదవి నుంచి తనను తొలగించే అవకాశాలు ఉన్నాయని కోహ్లికి ముందే తెలుసు. తను కూడా విశ్రాంతి కోరుకున్నాడు. అయినా టీ20లలో చెత్త ప్రదర్శన వన్డేపై ప్రభావం చూపకపోవచ్చు. ఏదేమైనా తను నిర్ణయం తీసుకున్నాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు క్రికెట్‌ అడిక్టర్‌ తన కథనంలో ప్రచురించింది. ఇవన్నీ చూస్తుంటే.. జై షా చెప్పినట్లు అనేక చర్చోపర్చల తర్వాతే కోహ్లి తన నిర్ణయం వెల్లడించినట్లు తెలుస్తోంది. 

చదవండి: T20 World Cup: అది నా కల.. కానీ సెలక్ట్‌ కాలేదు.. అయితేనేం..

>
మరిన్ని వార్తలు