Wriddiman Saha Case: సాహా వ్యవహారం.. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం!

24 Apr, 2022 10:48 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ శనివారం సమీక్షించింది. ఇంటర్య్వూ ఇవ్వనందుకు స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ బొరియా మజుందార్‌ తనను బెదిరించాడంటూ గత ఫిబ్రవరిలో సాహా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమాచారం ప్రకారం.. సాహా వ్యవహారంలో జర్నలిస్ట్‌ బొరియా మజుందార్‌దే తప్పని తేలడంతో అతనిపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో మజుందార్‌ టీమిండియా ఆటగాళ్లను కలవడం గానీ.. స్వదేశంలో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు వెళ్లడం చేయకూడదని బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా సాహా చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ప్రభుతేజ్‌ బాటియాలతో బీసీసీఐ ఒక కమిటీని నియమించింది. కాగా గత నెలలో కమిటీ ముందు హాజరైన సాహా, బొరియా మజుందార్‌లు తమ వెర్షన్‌ను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్‌ తనను బెదిరించాడని సాహా పేర్కొనగా.. మరోవైపు సాహా వాట్సప్‌ చాట్‌ను తారుమారు చేసి స్క్రీన్ షాట్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఆరోపించాడు. ఇద్దరి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటి నిజానిజాలు నిగ్గుతేల్చి శనివారం బీసీసీఐకి తమ నివేదికను సమర్పించింది.

''అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. సాహా వ్యవహారంలో తప్పు బొరియా మజుందార్‌దేనని రిపోర్టులో తేలిందని.. అందుకే భారత్‌ స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు మజుందార్‌ను అనుమతించకూడదు. అంతేకాదు ఆటగాళ్లను కూడా కలవకూడదు.. ఎలాంటి ఇంటర్య్వూలు తీసుకోకూడదు. ఇది రెండేళ్ల పాటు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాహా టీమిండియా తరపున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు.

చదవండి: సాహా ట్వీట్‌.. వాట్సాప్‌ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్‌ ప్లేయర్‌..’

Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ

మరిన్ని వార్తలు