ENG Vs PAK: పాక్‌తో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టులోకి కొత్త వ్యక్తి; ఆటగాడు మాత్రం కాదు

22 Nov, 2022 12:26 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌ ఒకటి నుంచి 21 వరకు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు జట్లకు ఈ సిరీస్‌ చాలా కీలకం.  అందుకే ఇరుజట్లు పూర్తిస్థాయి జట్లతో బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌ తమతో పాటు కొత్త వ్యక్తిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లనుంది.

అయితే ఆ కొత్త వ్యక్తి ఆటగాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంగ్లండ్‌ జట్టు వెంట వెళ్లనుంది మాస్టర్‌ చెఫ్‌. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు క్వాలిటీ ఫుడ్‌ అందించేందుకు తమ చెఫ్‌ను తీసుకెళ్లనుంది. ఎందుకంటే టి20 ప్రపంచకప్‌ కంటే ముందు ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌లో పర్యటించింది. అప్పుడు ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడగా.. చివరగా ఇంగ్లండ్‌ 4-3 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ విషయం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన టి20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఫుడ్‌ విషయమై మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌ అసలు బాలేదని.. తినడానికి ఇబ్బందిగా ఉందని.. క్వాలిటీ ఫుడ్‌ అందిస్తే బాగుండేదని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఈసీబీ టెస్టు సిరీస్‌కు మాత్రం నాణ్యమైన చెఫ్‌ను ఇంగ్లండ్‌ జట్టు వెంట పంపనుంది. కాగా ఇంగ్లండ్‌ జట్టు తమ వెంట చెఫ్‌ను తీసుకెళ్లడం కొత్త కాదు. ఇంతకముందు 2013-14 యాషెస్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు తమ వెంట ప్రత్యేక క్యాటరింగ్‌ బృందం తీసుకెళ్లడం అప్పట్లో చర్చకు దారి తీసింది. అంతేకాదు 2019లో కివీస్‌ పర్యటనలో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ ఫుడ్‌ పాయిజన్‌తో ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రి పాలైన లీచ్‌ ఆ సిరీస్‌ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. 

చదవండి: FIFA : రిపోర్టర్‌కు చేదు అనుభవం.. పోలీసుల జవాబు విని షాక్‌

మరిన్ని వార్తలు