Hardik Pandya May Vice Captain: రోహిత్‌ బాటలోనే కేఎల్‌ రాహుల్‌.. హార్దిక్‌కు ప్రమోషన్‌!

4 Aug, 2022 13:26 IST|Sakshi

వైట్‌బాల్‌ క్రికెట్‌లో బీసీసీఐ టీమిండియా వైస్‌కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ అతను వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌ సరిగ్గా ఆడింది లేదు. అయితే ఫిట్‌నెస్‌ సమస్య.. లేదంటే తరచూ గాయాల బారిన పడడం ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక రోహిత్‌ శర్మ కూడా టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ అయినప్పటి నుంచి అతను కూడా ఫిట్‌నెస్‌, గాయాలు ఇలా ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడు దూరమవుతూనే వస్తున్నాడు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ కూడా తన కెప్టెన్‌ బాటలోనే నడుస్తున్నాడు.

కనీసం రోహిత్‌ ఏదో ఒక సిరీస్‌ ఆడుతున్నప్పటికి.. రాహుల్‌ మాత్రం ఒక్క సిరీస్‌ ఆడకుండానే దూరమవుతూ వస్తున్నాడు. ఇక రోహిత్‌ లేని సమయాల్లో వైస్‌ కెప్టెన్‌ జట్టును నడిపించాల్సి ఉంటుంది. మంచి నాయకత్వం ప్రదర్శిస్తాడని రాహుల్‌ను ఎంపిక చేస్తే అతనేమో తరచూ గాయాలపాలవుతూ జట్టుకే ఇబ్బందిగా మారాడు. ఇలాగే కొనసాగితే టీమిండియాకు నష్టమని బీసీసీఐ భావిస్తోంది. దీంతో రానున్న టి20 ప్రపంచకప్‌కు రోహిత్‌కు డిప్యూటీగా ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. అంతకముందే ఆసియాకప్‌ 2022కు కూడా పాండ్యాను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 


ఇక రీఎంట్రీ తర్వాత అద్భుతాలు చేస్తున్న పాండ్యా.. రోహిత్ డిప్యూటీగా పనికొస్తాడని సెలక్టర్లు నమ్ముతున్నారు. అదీగాక అతడిలో సారథ్య లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని సెలక్టర్లు నమ్ముతున్నారు.ఇటీవలే ఐర్లాండ్‌తో టి20 సిరీస్‌ను టీమిండియా పాండ్యా సారధ్యంలో 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకముందు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించిన హార్ధిక్.. జట్టుకు టైటిల్‌ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. కానీ కెఎల్ రాహుల్ మాత్రం సారథిగా ఇంకా  పూర్తిస్థాయిలో నిరూపించుకోలేదు. 

రోహిత్ లేని సందర్భాల్లో టీమిండియాకు కెప్టెన్ (దక్షిణాఫ్రికా సిరీస్ లో) గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్ సారథ్యంలో భారత్.. 0-3తేడాతో ఓడింది. ఒక టెస్టులో సారథిగా ఉన్నా అందులోనూ పరాజయం తప్పలేదు. కెప్టెన్సీ వైఫల్యాలతో పాటు ఫిట్నెస్ సమస్యలతో రాహుల్ సతమతమవుతున్నాడు. గడిచిన ఏడాదిలో అతడు  జాతీయ జట్టుకు ఆడిన దానికంటే విరామాలు తీసుకున్నదే ఎక్కువ. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు హెర్నియా సర్జరీ చేయించుకున్న కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఉన్న రాహుల్‌ అక్కడే కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో విండీస్‌తో టి20 సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది.

మూడు ఫార్మాట్లకూ రోహిత్ శర్మను రెగ్యులర్ సారథిగా నియమించినా ఒక సిరీస్‌ ఆడుతూ.. గాయం.. ఫిట్‌నెస్‌ సమస్యల  కారణంగా మరొక సిరీస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో ఏడాది కాలంలోనే భారత్ కు సుమారు 8 మంది సారథులు మారారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్,  హార్ధిక్ పాండ్యా.. ఈ జాబితాలో  రాబోయే రోజుల్లో ఎవరి పేరు చేరనుందో గానీ ఈ ప్రయోగాలకు ముగింపు ఎక్కడో కూడా తెలియడం లేదు.

ఈ నేపథ్యంలో సెలక్టర్లు పాండ్యాకు వైస్‌ కెప్టెన్సీ అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో జరగనున్న ఆసియాకప్ లోనే ఈ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఆసియా కప్-2022 కోసం భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. ఈ టోర్నీకి కూడా రాహుల్ ఆడే అవకాశాలు తక్కువే.  రాహుల్‌ ఆసియా కప్‌ ఆడాలంటే ముందు ఫిట్‌నెస్‌ టెస్టు నిరూపించుకోవాల్సి ఉంటుంఉది. ఒకవేళ రాహుల్‌ ఎంపికైనా సెలెక్టర్లు పాండ్యానే వైస్‌కెప్టెన్‌గా నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  ఆసియా కప్‌ తర్వాత టి20 ప్రపంచకప్‌ 2022 ఉండడమే ఇందుకు కారణం. అందుకే పాండ్యాను వైస్‌కెప్టెన్‌గా నియమించే దిశగా సెలక్టర్లు ప్రణాళికలు రచిస్తున్నారు.


చదవండి: Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే

IND Vs WI: వీసా ఇచ్చేందుకు ససేమిరా‌.. అధ్యక్షుడి చొరవతో లైన్‌ క్లియర్‌

Rohit Sharma: టీమిండియా అభిమానులకు శుభవార్త! గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌!

మరిన్ని వార్తలు