Asia Cup 2023: పాక్‌లోనే ఆసియా కప్‌.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!

24 Mar, 2023 08:18 IST|Sakshi

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది. అయితే టోర్నీ పాక్‌లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీంతో మొదట ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) భావించింది. కానీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఆసియా కప్‌ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెలిపింది. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో మొండి వైఖరితోనే ఉంది.

దీంతో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఇరుబోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్‌ ఆడుతుందని.. టోర్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే భారత్‌ ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు సంబంధించి ఒమన్‌, యూఏఈ, ఇంగ్లండ్‌, శ్రీలంక పేర్లను పరిశీలించారు. ఈ వేదికల్లో ఏదో ఒకటి ఫైనలైజ్‌ చేయనున్నట్లు తెలిసింది.

ఒకవేళ టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్తు బుక్‌ చేసుకుంటే.. ఫైనల్‌ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్‌ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పీసీబీ మాత్రం ఏసీసీ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లయింది.

ఇక ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్‌ ఉండడంతో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు దేశాలు పాల్గొననుండగా.. భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌లు ఒక గ్రూప్‌లో ఉండగా.. మరొక గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న టోర్నీలో గ్రూప్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-4లో టాప్‌ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. 

చదవండి: ఎలిమినేటర్‌.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?

ఐపీఎల్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు