Ravindra Jadeja: జడ్డూనే తప్పుకున్నాడా.. బలవంతంగా తప్పించారా?!

1 May, 2022 12:32 IST|Sakshi
Courtesy: IPL Twitter

సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపి రవీంద్ర జడేజా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ జడేజాను కెప్టెన్‌గా నియమించింది. జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా తీసుకున్నాడు. ధోని పేరును నిలబెడతానని.. అతని నాయకత్వంలో నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన సీఎస్‌కేను ఇకపై విజయవంతంగా నడిపిస్తానని.. అందుకు జట్టు సహకారం ఎంతో అవసరమని, ధోని లాంటి వ్యక్తి తోడుగా ఉండడం.. మేనేజ్‌మెంట్‌ నాపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని జడేజా గొప్పలకు పోయాడు. 

అయితే సరిగ్గా నాలుగు వారాలు తిరిగేసరికి సీన్‌ మొత్తం మారిపోయింది. ఈ సీజన్‌లో సీఎస్కే పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన  8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన జడేజా ఆల్‌రౌండర్‌గాను నిరాశపరిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏది చూసుకున్నా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్న జడేజా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో  బ్యాటింగ్‌లో 121.73 స్ట్రయిక్‌ రేట్, 22.40 సగటుతో 112 పరుగులు మాత్రమే చేయగా... 42.60 సగటు, 8.19 ఎకానమీతో 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ ప్రభావం జడేజాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునేలా చేసింది. 


Courtesy: IPL Twitter

కెప్టెన్సీ భారం తనవల్ల కాదని.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే నాయకత్వ బాధ్యతలను ధోనికి అప్పగిస్తున్నట్లు జడ్డూ ప్రకటించాడు. కానీ ఇందులో వాస్తవమెంత అనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా జడ్డూ స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా.. లేక మేనేజ్‌మెంట్‌ ఒత్తిడి చేయడంతో బలవంతంగా తప్పుకున్నాడా అనేది ప్రశ్నార్థకం. జట్టును సరిగ్గా నడిపించలేకపోతున్నాడనే అతన్ని కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించారని ఒక వర్గం అభిమానులు అభిప్రాయపడ్డారు.  ధోని వారసత్వాన్ని నిలబెట్టడమనేది  చిన్న విషయం కాదు. అతడు సారథిగా లేని చెన్నైని నడిపించడం కూడా ఆషామాషీ కాదు. కానీ మరీ సగం సీజన్‌లో ఇలా కెప్టెన్సీ నుంచి జడేజా తప్పుకోవడంపై ప్రధానంగా జట్టు మేనేజ్‌మెంట్‌ ఒత్తిడి కారణమని తెలుస్తోంది. 

జడేజా లో లోపించింది అతడి ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు.. మేనేజ్‌మెంట్‌ అతడి మీద పెట్టుకున్న నమ్మకం. వరుసగా పరాజయాల బాట పట్టడంతో  సీఎస్‌కే యాజమాన్యానికి సీన్ అర్థమైంది. ధోని వారసుడు కచ్చితంగా జడ్డూ అయితే కాదన్నది వాళ్లు ఓ ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కే.. ప్లేఆఫ్స్ కు చేరాలంటే తర్వాత జరుగబోయే 6 మ్యాచులను నెగ్గాల్సి ఉంది. అది కష్టమే..? అయినా జట్టు మేనేజ్‌మెంట్‌ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. జడ్డూ నుంచి సారథ్య బాధ్యతలను వీలైనంత త్వరగా ధోనికి అప్పజెప్పి నష్టాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే జడేజాను బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసింది.


Courtesy: IPL Twitter
జడేజా నుంచి తిరిగి  నాయకత్వ పగ్గాలు ధోని చేతికి వచ్చాయి. మరి ధోని మ్యాజిక్ తో సీఎస్కే ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా..?  అనేది వేచి చూడాలి. ఇక ఆట మీద దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ అనూహ్య నిర్ణయం వల్ల అతనికి పెద్దగా ఒరిగేదేం లేదు.ఎందుకంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కే ప్లేఆఫ్‌ చేరాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంకో విషయమేంటంటే.. ధోనికి ఇదే చివరి సీజన్‌ అని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఒక్క సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ధోని కెప్టెన్‌గా ఎలాగూ జట్టును నడిపిస్తాడు. కానీ వచ్చే సీజన్‌కు  ధోని వారసుడి కోసం చెన్నై మళ్లీ జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంది.

ఈ సీజన్‌లో జట్టుగా కూడా సీఎస్కే విఫలమవుతూ వచ్చింది. గతేడాది ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయిన  రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక ధోని గ్యాంగ్‌గా ముద్రపడ్డ అంబటి రాయుడు,  రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీలు అడపా దడపా రాణించిందే తప్ప మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేదు. ఇక బౌలింగ్ లో డ్వేన్ బ్రావో తప్ప మిగిలిన వాళ్లెవరిలోనూ నిలకడ లేదు.  వీటన్నింటికీ మించి వేలంలో చెన్నై దక్కించుకున్న రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లేకపోవడం  ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇది సీఎస్కే జట్టును మానసికంగా బాగా దెబ్బతీసింది. 

చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Chahal- SuryaKumar: అంపైర్‌ ఔటివ్వలేదని అలిగాడు.. బుజ్జగించిన సూర్యకుమార్‌

మరిన్ని వార్తలు