ENG vs PAK: ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవం.. పాక్‌ హెడ్‌ కోచ్‌పై వేటు! బాబర్‌ కూడా..

22 Dec, 2022 01:01 IST|Sakshi

ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌లో ప్రక్షాళన మొదలైంది. తమ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజాకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైన పాకిస్తాన్‌ క్రికెట్‌.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పాక్‌ హెడ్‌ కోచ్‌ సక్లైన్ ముస్తాక్, కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై కూడా పీసీబీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వేటు వేసేందుకు సిద్దమయినట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం సక్లైన్ ముస్తాక్‌ తన హెడ్‌ కోచ్‌ బాధ్యతలు తప్పుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది జూలైలో బాబర్‌ ఆజం కూడా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.

"బుధవారం గడ్డాఫీ స్టేడియంలోని పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పీసీబీ సెలెక్టర్ మహ్మద్ వసీం కూడా పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశంలో టెస్టు కెప్టెన్సీ, హెడ్‌ కోచ్‌ సక్లైన్ పాత్ర గురించి చర్చ జరిగింది.  

టెస్టు కెప్టెన్‌గా బాబర్‌ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకున్నాం. అతడిని వచ్చే ఏడాది జూలై వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పాక్‌ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తాం" అని పీసీబీ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో సారథిగా విజయవంతమైన బాబర్‌.. టెస్టుల్లో మాత్రం తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు.
చదవండిబంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..?

మరిన్ని వార్తలు