Novak Djokovic: నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌.. జొకోవిచ్‌ దిగిరానున్నాడా!

3 Feb, 2022 20:15 IST|Sakshi

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ఎంత మొండిగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ వేసుకోకుండానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. అయితే కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు అనుమతిస్తామని ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయంలో జోకో విభేదించడం వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, జొకోవిచ్‌ మధ్య మొదలైన వివాదం కోర్టును కూడా తాకింది. అయితే కోర్టులోనూ జొకోవిచ్‌కు చుక్కెదురవడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను మూడేళ్ల పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడకుండా నిషేధించడం సంచలనంగా మారింది. అలా గ్రాండ్‌స్లామ్‌ ఆడకుండానే వివాదాస్పద రీతిలో జొకోవిచ్‌ వెనుదిరిగాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన నాదల్‌.. హోరాహోరి పోరులో మెద్వెదెవ్‌పై సంచలన విజయం

ఇదంతా గతం.. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్‌ విషయంలో సెర్బియా స్టార్‌ దిగిరానున్నాడని సమాచారం. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి జొకోవిచ్‌ ఒప్పుకున్నట్లు.. అతని జీవిత కథ రాస్తున్న డానియెల్‌ ముక్స్‌ ఒక ప్రకటన చేయడం ఆసక్తి కలిగించింది.''జొకోవిచ్‌ ఉ‍న్నపళంగా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కారణం.. రఫెల్‌ నాదల్‌'' అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను నాదల్‌ గెలవడం ద్వారా తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను వేసుకున్నాడు. ప్రస్తుతం నాదల్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా ఉ‍న్నాడు.

దీంతో నాదల్‌ రికార్డును బ్రేక్‌ చేయాలనే ఉద్దేశంతో జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో నాదల్‌ రికార్డును బ్రేక్‌ చేయగల సత్తా ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు రోజర్‌ ఫెదరర్‌.. మరొకరు జొకోవిచ్‌. గాయాల కారణంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న ఫెదరర్‌ సాధిస్తాడన్న నమ్మకం లేదు. అయితే ఫామ్‌ పరంగా చూస్తే జొకోవిచ్‌కు మాత్రం సాధ్యమవుతుంది. జొకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు.

చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు?

జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ విషయంలో వెనక్కు తగ్గడానికి నాదల్‌ రికార్డును బ్రేక్‌ చేయాలన్న కారణం మాత్రమే కాదు. దీనివెనుక మరొకటి కూడా ఉంది. ఇకపై టెన్నిస్‌లో ఏ టోర్నమెంట్‌ అయినా ఆటగాళ్లకు వ్యాక్సిన్‌ తప్పనిసరి అని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య స్పష్టం చేసింది. రానున్న వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ వ్యాక్సిన్‌ తీసుకున్న ఆటగాళ్లనే అనుమతి ఇస్తామని పేర్కొన్నాయి. దీంతో జొకోవిచ్‌ దెబ్బకు దిగిరానున్నాడు. ఒకవేళ ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోకుంటే మాత్రం తనను తానే నష్టపరుచుకున్నట్లు అవుతుందని.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేరదనే ఉద్దేశంతోనే జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. 
చదవండి: Novak Djokovic: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్‌..!

మరిన్ని వార్తలు