Zaheer Abbas Health Condition: ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్‌ దిగ్గజ క్రికెటర్‌

22 Jun, 2022 15:06 IST|Sakshi

పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ జహీర్‌ అబ్బాస్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్లు సమాచారం. లండన్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిసింది. నెల కిత్రం పని నిమిత్తం దుబాయ్‌ నుంచి లండన్‌కు వచ్చిన జహీర్‌ అబ్బాస్‌ కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి కోలుకున్న ఆయన మూడు రోజుల క్రితం చాతిలో నొప్పి ఉందని చెప్పడంతో లండన్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియాతో బాధపడుతున్న అబ్బాస్‌కు వైద్యులు  డయాగ్నసిస్‌ నిర్వహించారు.

''ప్రస్తుతం జహీర్‌ అబ్బాస్‌ పరిస్థితి బాగానే ఉందని.. అయితే ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉండడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచామని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు'' వైద్యులు తెలిపారు. కాగా పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ పరిస్థితిపై క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మహ్మద్‌ హఫీజ్‌, అలన్‌ విల్‌కిన్స్‌ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు జహీర్‌ అబ్బాస్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

ఇక పాకిస్తాన్‌ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన జహీర్‌ అబ్బాస్‌ 1969లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాక్‌ స్టార్‌ బ్యాటర్‌గా పేరు పొందిన జహీర్‌ అబ్బాస్‌ 72 టెస్టుల్లో 5062 పరుగులు, 62 వన్డేల్లో 2752 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 459 మ్యాచ్‌లాడిన జహీర్‌ అబ్బాస్‌ 34, 843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు, 158 అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఒక టెస్టు, మూడు వన్డేలకు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా పనిచేశాడు. 2020లో జాక్వెస్‌ కలిస్‌, లిసా సాత్లేకర్‌లతో సంయుక్తంగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించాడు.

చదవండి: Ben Stokes: ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. కెప్టెన్‌కు అస్వస్థత

'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్‌ అంట'.. ఇలాంటి బౌలింగ్‌ చూసుండరు!

మరిన్ని వార్తలు