Asia Cup 2023: పాక్‌కు ఎదురుదెబ్బ.. యూఏఈలో ఆసియాకప్‌!

5 Feb, 2023 09:12 IST|Sakshi

ఆసియా కప్‌ తమ దేశంలో నిర్వహించాలనుకున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆసియాకప్‌ పాక్‌లో నిర్వహిస్తే తాము ఆడబోయేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈసారి కూడా ఆసియాకప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది.

ఏసీసీ ఛైర్మన్‌ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్‌ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే అంశంపై చర్చించారు. కాగా ఆసియాకప్‌ను ఎక్కడ నిర్వహించాలనేది మార్చిలో ఖరారు చేయనున్నారు. ఇక షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీలో  ఆడేందుకు పాక్‌కు వెళ్లమని గతేడాది అక్టోబర్‌లోనే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ టోర్నీలో భారత్‌ ఆడకుంటే ఆసియా కప్‌ పాక్‌ నిర్వహించినప్పటికి  ఆదాయం మాత్రం పెద్దగా రాదు.

భారత్‌ సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి తగినంత గ్రాంటు లభిస్తుంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆసియా కప్‌ నిర్వహణ పేరుతో బీసీసీఐతో సున్నం పెట్టుకోవడం కంటే భారత్‌కు అనుగుణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించడమే మేలని పీసీబీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగానైనా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని యోచిస్తోంది.

చదవండి: యువరక్తం ఉరకలేస్తుంది.. కుర్రాళ్లు  కుమ్మేస్తున్నారు

'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా'

మరిన్ని వార్తలు