Ranji Trophy 2022: దీనస్థితిలో ఉత్తరాఖండ్‌ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు

10 Jun, 2022 19:48 IST|Sakshi

రంజీ ట్రోపీ 2022లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ముంబై జట్టు ఉత్తరాఖండ్‌పై 725 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలోనే ఉత్తరాఖండ్‌కు ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచిపోయింది. ఈ ఓటమి ఉత్తరాఖండ్‌ జట్టును ఎంతలా బాధపెట్టిందో తెలియదు కానీ.. తాజాగా ఆ జట్టు ఆటగాళ్లకు ఇస్తున్న రోజువారీ వేతనం విషయంలో కొన్ని షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

గత 12 నెలలుగా ఉత్తరాఖండ్‌ రంజీ జట్టులో ఆటగాళ్లు అందుకుంటున్న రోజువారీ వేతనం ఎంతో తెలుసా.. కేవలం వంద రూపాయలు మాత్రమే. ఒక రంజీ ఆటగాడికి ఇచ్చే రోజువారీ వేతనంలో ఇది ఎనిమిదో వంతు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక న్యూస్‌ చానెల్‌ ఇచ్చిన నివేదిక ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక రంజీ క్రికెటర్‌కు రోజువారీ వేతనంలో ఒక క్రికెటర్‌కు రూ. 1000-1500 నుంచి అందుకుంటారు. అదే ఒక సీనియర్‌ క్రికెటర్‌కు రూ. 2వేల వరకు పొందుతారు. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేసిన ఉత్తరాఖండ్‌  క్రికెట్‌ అసోసియేషన్‌ గత 12 నెలలుగా సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా కేవలం వంద రూపాయాలను మాత్రమే రోజూవారీ వేతనంగా ఇస్తుండడం శోచనీయం.

అయితే ఇటీవలే 'టోర్నమెంట్‌ అండ్‌ ట్రయల్‌ క్యాంప్‌ ఎక్స్‌పెన్సెస్‌' పేరిట తయారు చేసిన ఆడిట్‌ రిపోర్టులో మాత్రం సదరు క్రికెట్‌ అసోసియేషన్‌ ఘనంగానే లెక్కలు చూపించింది. ఆటగాళ్ల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులతో​ కలిపి రూ.1,74,07,346 ఖర్చు చేస్తున్నట్లు చూపించింది. ఇందులో రూ.49,58,750లను ఆటగాళ్లకిస్తున్న రోజువారీ వేతనం కింద లెక్క చూపించింది. అంతేగాక మరో 35 లక్షలతో ఆటగాళ్లకు అరటిపండ్లు, రూ.22 లక్షలతో వాటర్‌ బాటిల్స్‌ అందిస్తున్నట్లుగా రిపోర్ట్‌లో చూపించింది. అయితే ఆటగాళ్లకు ఆ సౌకర్యాలేవీ అందట్లేదు. సరికదా.. డబ్బులు లేవనే సాకుతో కేవలం వంద రూపాయలనే రోజువారీ వేతనంగా ఇస్తున్నారు.

ఇదే విషయమై ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సీనియర్‌ క్రికెటర్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ను..'పెండింగ్‌ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తారు'అంటూ నిలదీశాడు. దానికి సదరు అధికారి ‘అరె.. ఇదే ప్రశ్న ఎ‍న్నిసార్లు అడుగుతావయ్యా?.. మీ డబ్బులు మీకు వచ్చేవరకు ఏ స్విగ్గీ, జొమాటోలోనే ఆర్డర్‌ చేసుకోండి’ అంటూ పెడసరిగా సమాధానం ఇచ్చాడు.అంతేకాదు ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు ఆటగాళ్లను మానసికంగానూ ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సదరు కథనం ద్వారా వెలుగు చూసింది. మరి ఇప్పటికైనా బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఏదైనా యాక్షన్‌ తీసుకుంటే బాగుంటుందని ట్విటర్‌లో పలువురు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: తెగ బాధపడిపోతున్నాడు.. ఎవరీ క్రికెటర్‌?

రంజీలో సెంచరీ బాదిన క్రీడా మం‍త్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్‌

>
మరిన్ని వార్తలు