Virat Kohli: రాజీనామా విషయాన్ని ముందుగా ఆయనతో చర్చించిన తర్వాతే.. కోహ్లి ప్రకటన!

16 Jan, 2022 16:09 IST|Sakshi

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించి విరాట్‌ కోహ్లి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. జట్టును విజయపథంలో నిలపడానికి వందకు 120 శాతం కృషి చేశానని, అయితే అలా జరగని పక్షంలో సారథిగా కొనసాగడం సరైంది కాదని పేర్కొన్నాడు. ఆశించిన మేరకు ఫలితాలు రాబట్టకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు ముగిసిన తర్వాతి రోజు కోహ్లి ఈ ప్రకటన చేశాడు.

అయితే, వన్డే కెప్టెన్సీలో కొనసాగుతున్నాన్నప్పటికీ... పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలన్న నిబంధనతో బీసీసీఐ కోహ్లిని తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రోహిత్‌ శర్మను నియమించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఇలా కోహ్లిపై వేటు వేసింది. ఈ క్రమంలో  సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన కోహ్లికి మూడో టెస్టు పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. 

ఈ పరిణామాలా నేపథ్యంలో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజు అంటే జనవరి 15న కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే, ఈ స్టేట్‌మెంట్‌కు ముందు కోహ్లి.. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో చర్చించాడట. తన నిర్ణయం గురించి ద్రవిడ్‌తో మట్లాడి... ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి జై షాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో సుదీర్ఘ చర్చ తర్వాత తాను రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు సమాచారం.

అంతేగాక సహచర సభ్యులతో కూడా ఈ విషయం గురించి చెప్పి.. ఆ తర్వాతే కోహ్లి తన నిర్ణయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మకే టెస్టు పగ్గాలు అప్పగిస్తారా.. లేదంటే మరో ఇతర సభ్యుడి వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరోవైపు.. జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌రాహుల్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.  

చదవండి: India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే...
Virat Kohli: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు