నేటి తరంలో అతనే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. 

25 May, 2021 15:09 IST|Sakshi

వెల్లింగ్టన్: అల్‌ టైమ్‌ గ్రేట్ అల్‌ రౌండర్లలో ముఖ్యుడుగా చెప్పుకునే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీ.. ప్రస్తుత తరంలో అల్ రౌండర్లపై తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. జెంటిల్మెన్ గేమ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో రాణించే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారని, నేటి ఆధునిక క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ తన దృష్టిలో ఉత్తమ అల్ రౌండర్ అని పేర్కొన్నాడు. ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. అలాగే అతను ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అనేక సందర్భాలను పరిగణలోకి తీసుకొనే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాడు. ఇందుకు 2019 వన్డే ప్రపంచ కప్, హెడింగ్లే టెస్టులను(ఆసీస్ ఫై 135 నాటౌట్) ఉదహరించాడు. 

చరిత్రలో గ్రేట్ అల్ రౌండర్లుగా చెప్పుకునే గ్యారీఫీల్డ్ సోబర్స్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, జాక్ కలిస్ లాంటి ఆటగాళ్లకు ఉండిన లక్షణాలన్నీస్టోక్స్ లో  పుష్కలంగా ఉన్నాయని, అతను మరికొంత కాలం రెండు విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్) రాణించగలిగితే, దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించగలడని  ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇది అతనికి అంత సులువు  కాకపోవచ్చని, ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్‌కు ఫిట్‌నెస్ తో పాటు గాయాల బారిన పడకుండా నిలకడ రాణించడం చాలా ముఖ్యమని, ఈ రెండు అంశాలపై అతను దృష్టి కేంద్రీకరించగలిగితే, ఈ తరంలోనే కాదు.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ అల్ రౌండర్ గా నిలిచిపోతాడని సూచించాడు. 

నేటి తరం అల్ రౌండర్లైన షకీబ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్ అల్ రౌండర్లు కావడంతో వారిని పరిగణలోకి తీసుకోలేమని, ఏదిఏమైనప్పటికే వారు కూడా అల్ రౌండర్లేనని వివరించాడు. జేసన్ హోల్డర్, హార్దిక్ పాండ్యా , క్రిస్ వోక్స్, కోలిన్ గ్రాండ్ హోమ్ తదితరులకు ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్లుగా రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా, 70 80 దశకాల్లో మేటి అల్ రౌండర్ గా నిలిచిన హ్యాడ్లీ..  న్యూజిలాండ్ తరఫున 3124 పరుగులతో పాటు 431 వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చాలాకాలం తర్వాత అతని రికార్డును కపిల్ తిరగరాసాడు. 
చదవండి: ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్‌లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు..
 

మరిన్ని వార్తలు