Shane Warne- Ricky Ponting: వార్న్‌ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్‌

6 Mar, 2022 17:28 IST|Sakshi

‘‘మిగతా వాళ్లలాగే నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. పొద్దున నిద్ర లేవగానే మెసేజ్‌లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను పొద్దున్నే నెట్‌బాల్‌ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్‌తో గత రాత్రి నిద్రపోయాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. తనతో మడిపడిన జ్ఞాప​​కాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాడు షేన్‌ వార్న్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. 

కాగా ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం, స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్‌లాండ్‌లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో వార్న్‌ సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడిని తలచుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. మణికట్టుతో మాయ చేసే కింగ్‌ ఆఫ్‌ స్పిన్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్‌ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు.

ఇక 15 ఏళ్ల వయసులో క్రికెట్‌ అకాడమీలో వార్న్‌ను కలిశానన్న 47 ఏళ్ల పాంటింగ్‌... వార్న్‌ తనకు ఓ నిక్‌నేమ్‌ పెట్టాడంటూ గుర్తు చేసుకున్నాడు. దశాబ్దకాలం పాటు కలిసి క్రికెట్‌ ఆడామని, కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామంటూ అతడితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించాడు. కాగా రికీ పాంటింగ్‌ సారథ్యంలో వార్న్‌ అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం ఏర్పడింది.

చదవండి: Shane Warne: స్పిన్‌ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!

మరిన్ని వార్తలు