'కోహ్లి కొట్టిన సిక్స్‌ చరిత్రలో నిలిచిపోతుంది'

8 Nov, 2022 20:54 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో కోహ్లీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్ల తప్పిదాలను క్యాష్‌ చేసుకున్న విరాట్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఇక ఆ మ్యాచ్‌లో 19వ ఓవర్లో కోహ్లి కొట్టిన రెండు సిక్సర్లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌ అవడమే కాదు టీమిండియా వైపు మ్యాచ్‌ మొగ్గుచూపింది.  

తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ''కోహ్లి సిక్స్‌ ప్రపంచకప్‌ చరిత్రలోనే హైలెట్‌గా నిలిచిపోతుంది. హారిస్‌ రౌఫ్‌‌ బౌలింగ్‌లో అతడి తల మీదుగా కోహ్లి కొట్టిన సిక్సర్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ షాట్‌ గురించి అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ షాట్‌ గొప్పదని చెప్పలేం కానీ టి20 ప్రపంచకప్‌ వరకు వస్తే మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోయే సిక్సర్‌'' అని పేర్కొన్నాడు.

ఇక టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 దశలో గ్రూప్‌-2 టాపర్‌గా నిలిచిన టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో గురువారం(నవంబర్‌ 10న) అమితుమీ తేల్చుకోనుంది. కేఎల్‌ రాహుల్‌ మంచి టచ్‌లో ఉండడం.. కోహ్లి, సూర్యకుమార్‌లు తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తుండడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. మొత్తంగా ఇంగ్లండ్‌ బౌలర్లకు, టీమిండియా బ్యాటర్లకు మధ్య సవాల్‌ అని చెప్పొచ్చు. 

చదవండి: Suryakumar Yadav: '360 డిగ్రీస్‌' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్‌

మరిన్ని వార్తలు