IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌

12 Aug, 2022 21:36 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఎనలేని క్రేజ్‌. ఎన్నిసార్లు చెప్పుకున్నా బోర్‌ కొట్టని అంశం కూడా. ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే టీఆర్పీ రేటింగ్స్‌ బద్దలవడం ఖాయం. దాయాదుల సమరాన్ని ఇరుదేశాల అభిమానులు కన్నార్పకుండా చూస్తారు. అలాంటి అవకాశం మరోసారి ఆసియాకప్‌ రూపంలో వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా ఇరుజట్లు మరోసారి అమితుమీ తేల్చుకోనున్నాయి. ఎవరు గెలిస్తారన్న దానిపై భారీ అంచనాలు ఉండడం సహజం.

టీమిండియా ఫెవరెట్‌ అని కొందరంటే.. లేదు ఈసారి పాకిస్తాన్‌దే విజయం అని మరికొందరు జోస్యం చెబుతుంటారు. మ్యాచ్‌ జరిగేంతవరకు ఇలాంటి జోస్యాలు ఎన్నో వస్తూనే ఉంటాయి. మరి అంత క్రేజ్‌ ఉన్న భారత​-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఎవరో గెలుస్తారనే దానిపై మాజీ క్రికెటర్లు కూడా తమకు నచ్చింది చెబుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ ఆసియా కప్‌లో భారత్‌- పాకిస్తాన్‌ మధ్య విజేత ఎవరనేది జోస్యం చెప్పాడు.

''ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కున్న క్రేజ్‌ పోవడం కష్టం. క్రికెట్‌ చరిత్రలో ఈ ఇరుజట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు. ఒక క్రికెట్‌ లవర్‌గా నేను చెప్పేదేం ఏంటేంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను కూడా చిరకాల ప్రత్యర్థులగానే చూస్తారు. కానీ యాషెస్‌ లాంటి టెస్టు సిరీస్‌కు మాత్రమే ఇది పరిమితం. కానీ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉన్న ఆధిపత్య దోరణి అలా ఉండదు. వన్డే, టెస్టు, టి20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులుగానే ఉంటారు. అందుకే ఈ మ్యాచ్‌కు ఇంత క్రేజ్‌ ఉంటుంది.

ఇక ఆసియాకప్‌లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై భారత్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్‌ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్‌ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు. కానీ నా ఓటు టీమిండియాకే వేస్తున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది.

ఇరుజట్ల ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేనప్పటికి.. నా దృష్టిలో మాత్రం భారత్‌ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక ఆసియాకప్‌కు ఎంపిక చేసిన భారత్‌ జట్టు కూడా సమతుల్యంగా ఉంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో హెవీ రొటేషన్‌లోనూ భారత్‌ 21 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌లు గెలిచింది. కెప్టెన్లు మారినా టీమిండియా సక్సెస్‌ మాత్రం ఎక్కడా ఆగలేదు. బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ దూరమైనప్పటికి బౌలింగ్‌ టీమ్‌ పటిష్టంగా ఉండడం సానుకూలాంశం. రానున్న టి20 ప్రపంచకప్‌ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్‌ టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

>
మరిన్ని వార్తలు