BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల క్రికెటర్లు నలుగురు.. రింకూ, తిలక్‌ ఇంకా..

29 Feb, 2024 11:17 IST|Sakshi
రుతురాజ్‌, తిలక్‌, రింకూ (PC: BCCI)

ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల(2023-24)లో పెద్దపీట వేసింది. 

అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్‌ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్‌ డబుల్‌ ప్రమోషన్‌ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్‌ క్రాంటాక్ట్‌ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. 

వీరంతా ‘సి’ గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్‌ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?!

రింకూ సింగ్‌
దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 

నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్‌ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్‌రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్‌లు, 31 ఫోర్లు బాదాడు.  ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్‌ రింకూ సింగ్‌ రెండు మ్యాచ్‌లలో కలిపి 55 పరుగులు సాధించాడు.  

నంబూరి తిలక్‌ వర్మ
హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ అండర్‌19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఓపెనర్‌గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్‌ రుతురాజ్‌ గై​​క్వాడ్‌. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. 

ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ గోల్డ్‌ మెడల్‌ అందించాడు. 

శివం దూబే
సీఎస్‌కే స్టార్‌  క్రికెటర్‌, ముంబై పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు.

రవి బిష్ణోయి
రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్‌.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్‌ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్‌.

ముకేశ్‌ కుమార్‌
బెంగాల్‌ పేసర్‌, 30 ఏళ్ల ముకేశ్‌ కుమార్‌ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్‌ బౌలర్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు.

ప్రసిద్‌ కృష్ణ
2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్‌.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు.

ఆవేశ్‌ ఖాన్‌
మధ్యప్రదేశ్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌. 27 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు.

రజత్‌ పాటిదార్‌
లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ రజత్‌ పాటిదార్‌. 1993లో ఇండోర్‌లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు.

తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు.

జితేశ్‌ శర్మ
విదర్భ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్‌ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు.  

చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు


 

whatsapp channel

మరిన్ని వార్తలు