Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్‌.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్‌ అంటే కేవలం..

30 Dec, 2022 08:54 IST|Sakshi
పీలేతో నేమార్‌

Brazil Legend Pele: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్‌ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఫుట్‌బాల్‌ స్టార్ల నివాళులు
ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ సహా రన్నరప్‌ ఫ్రాన్స్‌ సారథి కైలియన్‌ ఎంబాపే, పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నేమార్‌ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. 

నేమార్‌ ఎమోషనల్‌ నోట్‌
‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా.  నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్‌ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. 

ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్‌ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్‌, బ్రెజిల్‌ ఒక్కటిగా వెలుగొందాయి. 

ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్‌ ఉద్వేగపూరిత నోట్‌ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్‌ చేస్తూ ‘కింగ్‌’ పట్ల అభిమానం చాటుకున్నాడు.

ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం
ఫుట్‌బాల్‌ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్‌ అని ఎంబాపే ట్వీట్‌ చేశాడు. ఇక పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్‌ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. 

అల్విదా కింగ్‌ 
ఫుట్‌బాల్‌ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్‌ ప్రపంచకప్‌ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్‌ ముఖచిత్రంగా మారారు. 

అంతా స్టార్‌ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్‌ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్‌ సాధించారు. 10 నంబర్‌ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

A post shared by NJ 🇧🇷 (@neymarjr)

A post shared by Cristiano Ronaldo (@cristiano)

A post shared by Leo Messi (@leomessi)

మరిన్ని వార్తలు