'నా పేరు వాషింగ్టన్‌.. డీసీకి వెళ్లాలనుకుంటున్నా'

5 Feb, 2021 21:15 IST|Sakshi

చెన్నై: టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నాడు.ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో 89* పరుగుల ఇన్నింగ్స్‌తో పంత్‌ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.గబ్బా టెస్టు తర్వాత పంత్‌ను సైడర్‌మ్యాన్‌ థీమ్‌ సాంగ్‌తో పోల్చుతూ వచ్చిన వీడియో బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పంత్‌ తొలిరోజు ఆటలో సుందర్‌ను ట్రోల్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 70వ ఓవర్‌ వేయడానికి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ను ఉద్దేశించి పంత్‌ ట్రోల్‌ చేశాడు. నా పేరు వాషింగ్టన్‌.. నేను డీసీకీ వెళ్లాలనుకుంటున్నా అంటూ పేర్కొన్నాడు. పంత్‌ వ్యాఖ్యలు స్టంపింగ్‌ మైక్‌లో రికార్డు కావడంతో విషయం బయటికి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంత్‌పై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. పంత్‌ ఉంటే ఆ కిక్కే వేరప్పా.. టీమిండియాలో ఎంటర్‌టైన్‌ చేయడానికి పంత్‌ ఒక్కడు చాలు.. సీరియస్‌గా కీపింగ్‌ చేస్తూనే పక్కనున్న వారిని నవ్వించడంలో పంత్‌ దిట్ట అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఆసీస్‌ పర్యటనలో దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన రిషబ్‌ పంత్‌  తుది జట్టులో ఉంటాడని కోహ్లి మ్యాచ్‌కు ముందురోజే చెప్పిన విషయం అందరికి తెలిసిందే. దీంతో వృద్ధిమాన్‌ సాహా మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా పంత్‌ టీమిండియా తరపున 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. 89.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

చదవండి: కోహ్లి ఫిజియో అవతారం.. చూసి తీరాల్సిందే

మరిన్ని వార్తలు