ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్‌

19 Jan, 2021 19:31 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంలో టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్‌ గిల్‌ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్‌ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్‌ ఆడిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు. ఈరోజు పంత్‌ ఆడిన ఇన్నింగ్స్ ప్ర‌తి భార‌త అభిమాని మదిలో కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

కాగా నాలుగో టెస్టులో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన పంత్‌ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. 'నా క‌ల నిజ‌మైంది. నేను ఫామ్‌లో లేని స‌మ‌యంలో టీమ్ నాకు మ‌ద్ద‌తుగా నిలిచింది. తొలి టెస్ట్ త‌ర్వాత నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాం. టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ నాకు అండ‌గా ఉంది. నేనో మ్యాచ్ విన్న‌ర్ అంటూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది'అని పంత్ అన్నాడు. చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం

అయితే స్వతహాగా రిషబ్‌ పంత్‌ మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పంత్‌ ఆరంభం నుంచే తనదైన దూకుడు ప్రదర్శించేవాడు. ఫామ్‌లో ఉంటే ప్రత్యర్థి ఎవరైనా సరే పంత్‌ మాత్రం బాదుడే లక్ష్యంగా పెట్టుకునేవాడు. మంచి స్ట్రైక్‌ రేట్ కలిగిన పంత్‌కు నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుంటాడనే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. మ్యాచ్‌లు గెలుస్తామన్న దశలో దాటిగా బ్యాటింగ్‌ కొనసాగించే పంత్‌ అనవసర షాట్‌లు ఆడి వికెట్‌ పోగొట్టుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ ఒక్క అంశంతోనే అతను జట్టులో సుస్థిరస్థానం పొందేవాడు కాదు.

వాస్తవానికి ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టు సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ మొదట రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే టెస్టు జట్టు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మొదటిటెస్టులో అంతగా ఆకట్టుకోకపోవడంతో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో పంత్‌ మరోసారి ట్రోల్స్‌ బారీన పడ్డాడు. అయితే వీటిని పట్టించుకోని బీసీసీఐ మూడో టెస్టులోనూ పంత్‌ను ఆడించింది.
చదవండి: ఆసీస్‌తో సిరీస్‌ : అసలైన హీరో అతనే

కాగా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 97 పరుగులతో అదరగొట్టాడు. ఆసీస్‌ విధించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంత్‌ పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పంత్‌ ఉన్నంతవరకు మ్యాచ్‌ టీమిండియావైపై మొగ్గుచూపింది. అయితే అనూహ్యంగా 97 పరుగులు చేసిన పంత్‌ అనవసర షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకోవడం.. ఆ తర్వాత అశ్విన్‌, విహారిలు ఓపికతో ఇన్నింగ్స్‌ ఆడడంతో టీమిండియా మ్యాచ్ను‌ డ్రా చేసుకుంది.  అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం పంత్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకుండా చివరిదాకా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. కాగా పంత్‌ టీమిండియా తరపున 16 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.చదవండి: పాపం లాంగర్‌.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది

Poll
Loading...
మరిన్ని వార్తలు