Rishabh Pant: పంత్‌ అరుదైన ఫీట్‌.. ఈ ఏడాదిలో టీమిండియా తొలి ఆటగాడిగా

30 Jul, 2022 07:23 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మరో అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో తొలి టి20లో 14 పరుగులు చేయడం ద్వారా ఈ ఏడాది టి20ల్లో టీమిండియా తరపున వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు పంత్.. 988 పరుగులతో (అన్ని ఫార్మాట్లలో కలిపి)  ఉండేవాడు. విండీస్ తో తొలి టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో.. 12 పరుగులకు చేరుకోగానే ఈ ఏడాది వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా  సెంచరీ చేసిన పంత్.. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా అందించాడు. పంత్ తర్వాత ఈ జాబితాలో భారత్ నుంచి  శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. అయ్యర్.. 23 ఇన్నింగ్స్ లలో 866 పరుగులు చేశాడు.

ఇక వరుస విజయాలతో టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయగా.. టి20 సిరీస్‌లోనూ భోణీ కొట్టింది. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 68 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రోహిత్‌ శర్మ 64 పరుగులతో ఆకట్టుకోగా.. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ మరోసారి ఫినిషర్‌ పాత్ర పోషించడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ చేదనలో చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్‌ బ్యాటర్లలో ఎవరు కూడా 30 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలా రెండు రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్‌ కుమార్‌, జడేజాలు చెరొక వికెట్‌ తీశారు.

చదవండి: టీమిండియా ఆల్‌రౌండ్‌ షో.. 68 పరుగులతో గెలుపు

మరిన్ని వార్తలు