Rishabh Pant Accident: పంత్‌ ఆరోగ్యంపై లక్ష్మణ్‌ ట్వీట్‌.. కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు

30 Dec, 2022 10:37 IST|Sakshi

Rishabh Pant- Car Accident- Pray For Speedy Recovery: టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రార్థించాడు. పంత్‌కు ప్రాణాపాయం తప్పిందన్న లక్ష్మణ్‌ త్వరగా కోలుకో చాంపియన్‌ అంటూ 25 ఏళ్ల ఈ వికెట్‌ కీపర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. కాగా శుక్రవారం ఉదయం రిషభ్‌ పంత్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 

ఉత్తరాఖండ్‌కి నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలో ఈ ఘటన చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, పంత్‌ ముందే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడగలిగాడు.

కానీ, ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తుండటంతో #RishabhPant ట్రెండ్‌ అవుతోంది.

లక్ష్మణ్‌ ట్వీట్‌ ద్వారా..
ఈ క్రమంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ మేరకు బిగ్‌ అప్‌డేట్‌ అందించాడు. ‘‘పంత్‌ కోసం ప్రార్థిస్తున్నా. దేవుడి దయ వల్ల అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’ అని లక్ష్మణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

స్పందించిన క్రీడా వర్గాలు
రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదం గురించి తెలుసుకున్న క్రికెట్‌ వర్గాల ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ‘‘వీలైనంత త్వరగా కోలుకో డియర్‌ పంత్‌’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

ఉదయమే తన గురించి ఆలోచించా
ఇక.. ‘‘ఈరోజు ఉదయమే రిషభ్‌ పంత్‌ గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలోనే ఇలా.. తను బాగుండాలి. త్వరగా కోలుకోవాలి’’ అని క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా భోగ్లే ట్వీట్‌ చేశాడు. ఇక ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ సైతం.. రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు.  కాగా పంత్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌ సీఎం ఆదేశాలు
రిషభ్‌ పంత్‌ కారు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ పంత్‌ ప్రమాదానికి గురయ్యాడన్న ఆయన.. వైద్య సహాయం అందించి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా ఈ ఏడాది పంత్‌ను తమ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమిస్తూ పుష్కర్‌ సింగ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్‌.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్‌ అంటే కేవలం..
Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు.. టి20 కెప్టెన్‌గా

>
మరిన్ని వార్తలు