వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్‌ పంత్‌

24 May, 2022 09:37 IST|Sakshi
Photo Courtesy: IPL

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఓ స్థానిక క్రికెటర్‌ చేతిలో దారుణంగా మోసపోయాడు. ఖరీదైన వాచీలు అమ్మిపెడతానని చెప్పిన సదరు క్రికెటర్‌ దాదాపు 2 కోట్ల వరకు విలువ చేసే పంత్‌ సొత్తును కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా చెందిన ఓ స్థానిక క్రికెటర్ (మ్రినాంక్ సింగ్) ఖరీదైన వాచీలు, నగలు, మొబైల్‌ ఫోన్లను (వాడినవి) మంచి ధరకు అమ్మిపెడతానని.. అలాగే ఇంటర్నేషల్‌ బ్రాండ్‌ వాచీలను అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని రిషబ్‌ పంత్‌ను కలిశాడు. 

వాచీలంటే పడి చచ్చే పంత్‌.. తన వద్ద ఉన్న 36.25 లక్షల విలువ చేసే ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌టింగ్ సిరీస్‌కి చెందిన వాచీని, అలాగే 62.60 లక్షల విలువ చేసే రిచర్డ్ మిల్లే వాచీని మ్రినాంక్‌కు ఇచ్చి మంచి ధరకు అమ్మిపెట్టాలని కోరాడు. ఇంతటితో ఆగకుండా బ్రాండెడ్‌ వాచీలు తక్కువ ధరకే వస్తాయని అత్యాశకు పోయి 2 కోట్లకు పైగా మొత్తాన్ని మ్రినాంక్‌కు ముట్టజెప్పినట్లు సమాచారం. 

పంత్‌ వద్ద నుంచి వాచీలు తీసుకున్న మ్రినాంక్‌.. అందుకు బదులుగా పంత్‌కు రూ. కోటి 63 లక్షల 70 వేల 731లకు బోగస్‌ చెక్‌ ఇచ్చాడు. చెక్‌ బౌన్స్‌ కావడంతో మోసపోయానని గ్రహించిన పంత్‌.. అతని మేనేజర్ పునీత్ సోలంకి సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుపై ఏడాది పాటు విచారణ జరిగిన అనంతరం గత వారం నిందితుడిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. 

దీంతో ముంబైలో తలదాచుకున్న మ్రినాంక్‌ను జూహు పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు. విచారణలో మ్రినాంక్ సింగ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. మొత్తంగా అత్యాశకు పోయిన పంత్‌ పరిస్థితి ఉన్నవీ పాయే.. ఉంచుకున్నవీ పాయే అన్న చందంగా మారింది. కాగా, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో పంత్‌ సారధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు