కొత్త ఇల్లు కొనమని వెంటపడుతున్నారు: పంత్‌

28 Jan, 2021 13:57 IST|Sakshi

కోహ్లి, రోహిత్‌కు కూడా ఇంత ధైర్యం ఉండదు పంత్‌!

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో చిరస్మరణీయ అనుభవాలు సొంతం చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన(తొలి రెండు మ్యాచ్‌లు) పంత్‌ గురువారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, ఇందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పటి నుంచి కొత్త ఇల్లు కొనమని ఇంట్లో వాళ్లు నా వెంటపడుతున్నారు. గురుగ్రాం బాగుంటుందా? లేదంటే వేరే ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా’’ అని పంత్‌ ట్వీట్‌ చేశాడు.(చదవండి: అప్పుడు పంత్‌ నిరాశకు లోనయ్యాడు: రహానే

ఇక నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కోల్‌కతాకు దగ్గరల్లో ఇల్లు కొనుక్కో.. ఐపీఎల్‌ ఆడటం ఈజీ అవుతుంది.. ఇదిగో నీ ముఖం సరిగ్గా ఇప్పుడు ఇలాగే(అంటే ఇప్పటికిప్పుడు కొంటా అని కాదు.. ఆలోచిస్తా అన్న తరహా మీమ్స్‌)ఉంటుంది కదా’’ అని కొంతమంది సరదాగా కామెంట్‌ చేశారు. మరికొంతమంది.. ‘‘ఆస్ట్రేలియా పౌరసత్వం, ఆధార్‌ కార్డు తీసుకుని సిడ్నీలో సెటిల్‌ అయిపో’’ అంటూ మూడో టెస్టు జ్ఞాప​కాలు గుర్తుచేస్తున్నారు. ఇక​ ఇంకొంత మంది మాత్రం.. ‘‘నేను కచ్చితంగా చెప్పగలను. ఇలాంటి ప్రశ్న అడిగేందుకు కోహ్లి, రోహిత్‌కు కూడా గట్స్‌ ఉండవు అంటే నమ్మండి’’ అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. (చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు!)

కాగా సిడ్నీ టెస్టులో రిషభ్‌ పంత్‌ 97 పరుగులతో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. అదే విధంగా నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌గా నిలిచాడు. ఈ క్రమంలో తాము సరికొత్తగా ప్రవేశపెట్టనున్న ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్’‌ లిస్టులో అతడి పేరు పరిశీలనలో ఉన్నట్లు ఐసీసీ బుధవారం పేర్కొంది. 

మరిన్ని వార్తలు