'రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే'

17 Aug, 2022 13:29 IST|Sakshi

ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరిస్తున్నాడు. అయితే రోహిత్‌ ఫిట్‌నెస్‌, వయస్సు దృష్ట్యా ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం కనిపించడం లేదన్నది చాలా మంది అభిప్రాయం. దీంతో రోహిత్‌ తర్వాత భారత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న విషయంపై చర్చ నడుస్తోంది. మరోవైపు రోహిత్‌పై పనిభారం తగ్గించి కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేయాలనే వాదనలూ వినిపిస్తున్నాయి.

కాగా 34 ఏళ్ల రోహిత్‌ కెప్టెన్‌గా వైట్‌బాల్‌ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఏర్పరచుకున్నాడు. ఇక రోహిత్‌ తర్వాత భారత టెస్టు కెప్టెన్సీ రేసులో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ఉన్నారు. ఇదే విషయంపై ఆకాష్‌ చోప్రా తన అభిప్రాయాలను యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకున్నాడు. టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్‌ అయ్యే అవకాశాలు కేఎల్‌ రాహుల్‌ కంటే రిషబ్‌ పంత్‌కే ఎక్కువగా ఉన్నాయని ఆకాష్‌ చోప్రా అన్నాడు.

భారత కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. కానీ
"భారత కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఉన్నారని నేను భావిస్తున్నాను. వారిలో కేఎల్‌ రాహుల్‌, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. అదే విధంగా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు కెప్టెన్‌ అయ్యే అర్హత ఉన్నప్పటికీ.. అతడికి జట్టులో సుస్ధిరమైన స్థానం లేదు. కాగా ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం భారత సారథి అయ్యే అవకాశాలు పంత్‌కే ఉన్నాయి.

అయితే రాహుల్‌ కూడా ప్రస్తుతం మూడు ఫార్మాట్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ కెప్టెన్‌గా రాహుల్‌ అంతగా అకట్టుకోలేకపోయాడు. ఇక పంత్‌ కెప్టెన్సీ పరంగా దూకుడుగా ఉన్నప్పటికీ బౌలర్లను మాత్రం సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌లో ఇదే మనం చూశాం. ఓ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టినప్పటికీ.. అతడికి తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసే అవకాశం పంత్‌ ఇవ్వలేదు. అయితే రాహుల్‌ కంటే పంత్‌ కాస్త బెటర్‌’’ అని ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: FIFA Ban On AIFF: భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

>
మరిన్ని వార్తలు