ఏం పని లేదు.. అందుకే ఇది మొదలుపెట్టా: పంత్‌

12 May, 2021 19:58 IST|Sakshi

ఢిల్లీ: కరోనా మహమ్మారితో ఐపీఎల్‌ 14వ సీజన్‌ తాత్కాలికంగా రద్దు కావడంతో టీమిండియా ఆటగాళ్లు ఇంటిపట్టునే ఉంటూ ప్రాక్టీస్‌.. ఫిట్‌నెస్‌ అంశాలపై దృష్టి పెట్టారు. జూన్‌ నెలలో న్యూజిలాండ్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమయ్యారు. టీమిండియా వికెట్‌ కీపన్‌ రిషబ్‌ పంత్‌ కూడా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.  దేశమంతా లాక్‌డౌన్‌ ఉండడంతో ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుగుచుకునే క్రమంలో ఉన్నాడు. ఈ సందర్భంగా పంత్‌ తన ఇంట్లోని గార్డెనింగ్‌ ఏరియాలో మోవర్‌ యంత్రంతో అటు ఇటు తిరుగుతూ గడ్డిని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

"యే దిల్‌ మాంగే ''మోవర్‌" అంటూ క్యాప్షన్‌ ఇచ్చి.. అనుకోకుండా వచ్చిన క్వారంటైన్‌ బ్రేక్‌తో ఏం చేయలో అర్థం కాలేదు. కానీ మా ఇంటి ఆవరణలో గార్డెనింగ్‌ చేయడం కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇది నాకు మంచి వ్యాయామమే గాక ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.'' అంటూ పేర్కొన్నాడు. పంత్‌ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

కాగా రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ దుమ్మురేపే ప్రదర్శన కనబరిచి 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇక పంత్‌ 8 మ్యాచ్‌ల్లో 213 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ నుంచి భీకరఫామ్‌లో ఉన్న పంత్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌తో  జరగిన సిరీస్‌లోనూ దుమ్మురేపాడు.
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌: అశ్విన్‌ ఒక్కడే.. పాక్‌ బౌలర్ల కెరీర్‌ బెస్ట్‌
'ధోనిని మిస్సవుతున్నా.. ఇప్పుడు పంత్‌ కనిపిస్తున్నాడు'

>
మరిన్ని వార్తలు