Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం

18 Jun, 2022 09:25 IST|Sakshi

టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ముందు పెద్ద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు అది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ రానున్న టి20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా జట్టులో పంత్‌ స్థానం గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం మరెవరో కాదు.. టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌. 37 ఏళ్ల వయసులో బ్యాటింగ్‌లో పదును చూపిస్తున్న కార్తిక్‌.. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వయసు పెరిగిన కొద్ది వన్నె తగ్గని ఆటతో కార్తిక్‌ రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నాడు.

ఐపీఎల్‌ ఫామ్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కార్తీక్‌ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్‌తో అతను సమాధానమిచ్చాడు. చూడచక్కటి షాట్లు ప్రదర్శించి 37 ఏళ్ల వయసులో సెలక్టర్లకు ప్రపంచకప్‌లో స్థానం కోసం సవాల్‌ విసిరాడు. ఇప్పుడు ఇదే పంత్‌ కొంప ముంచేలా ఉంది. ఇంకా ప్రపంచకప్‌కు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో అప్పటిలోగా టీమిండియా బెస్ట్‌ జట్టును ఎంపికచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అదే నిజమైతే ఇప్పుడును జోరును కార్తిక్‌ ఇలాగే కొనసాగిస్తే.. వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌గా దినేశ్‌ కార్తిక్‌ తుది జట్టులో చోటు దక్కడం ఖాయం.

రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసినప్పటికి అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. కార్తిక్‌ ఫామ్‌తో పాటు అతనికి ఇంకో అడ్వాంటేజ్‌ కూడా ఉంది. కార్తిక్‌ వయసు పరిశీలిస్తే..రిటైర్మెంట్‌కు దాదాపు దగ్గరికి వచ్చేసినట్లే. మహా అయితే ఇంకో సంవత్సరం జట్టులో ఉంటాడు. దీంతో రానున్న టి20 ప్రపం‍చకప్‌లో అతనికి అవకాశమిస్తే మంచిదని బీసీసీఐ అభిప్రాయం. కార్తిక్‌ కూడా టీమిండియాకు టి20 కప్‌ అందించి తీరుతానని చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇప్పుడున్న జోరులో కార్తిక్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు.

మారని పంత్‌ తీరు..
వాస్తవానికి పంత్‌.. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఉండకపోయుంటే ఈ పాటికే అతను జట్టులో స్థానం కోల్పోయేవాడేమో. ఈ మధ్య కాలంలో పంత్‌ ఆటతీరు చూసుకుంటే అలాగే ఉంటుంది. వరుసగా విఫలం కావడం.. జట్టు నుంచి తీసేస్తారు అన్న సందర్బంలో మళ్లీ బ్యాటింగ్‌లో మెరవడం.. యాదృశ్చికంగా టీమిండియా కూడా విజయం సాధించడంతో పంత్‌ తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ పంత్‌ పెద్దగా రాణించలేకపోతున్నాడు.

శుక్రవారం జరిగిన నాలుగో టి20లోనూ పంత్‌ బ్యాటింగ్‌లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి అనవసర షాట్‌కు యత్నించి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్‌ వరకు పంత్‌కు ఇబ్బంది లేకపోవచ్చు గానీ.. ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే మాత్రం రానున్న రోజుల్లో అతని స్థానం గల్లంతవ్వడం ఖాయం. మరోవైపు మరో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ మాత్రం​ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున ఇప్పటివరకు ఇషాన్‌ కిషన్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇలా ముందు ఇషాన్‌ కిషన్‌.. వెనుక చూస్తే దినేశ్‌ కార్తిక్‌లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉండగా.. పంత్‌ మాత్రం నిర్లక్ష్యంగా ఆడుతూ తన స్థానానికి ఎసరు తెచ్చుకుంటున్నాడు.

చదవండి: Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి

>
మరిన్ని వార్తలు