Rishabh Pant: క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు

30 Dec, 2022 09:06 IST|Sakshi

Cricketer Rishabh Pant- Car Accident: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ‍ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.


ప్రమాదాన్ని పసిగట్టిన పంత్‌ కారు నుంచి దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్‌ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను ప్రాథమిక చికిత్స కోసం తొలుత డెహ్రాడూన్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత అక్కడి నుంచి మాక్స్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. మంగ్లూర్‌ పరిధిలోని నేషనల్‌ హైవే-58 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక ఎస్సీ దేహాత్‌ స్వపన్‌ కిషోర్‌ తెలిపినట్లు వెల్లడించింది.

అద్భుత శతకంతో
ఇక ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో 25 ఏళ్ల యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. బంగ్లా పర్యటన తర్వాత దుబాయ్‌ వెళ్లిన అతడు.. అనంతరం స్వస్థలం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో పంత్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. కాగా అనతికాలంలోనే టీమిండియా కీలక సభ్యుడిగా ఎదిగిన పంత్‌ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తమ అంబాసిడర్‌గా నియమించుకుంది.

చదవండి: Rishabh Pant: 6 సార్లు తృటిలో చేజారిన శతకం! అయితే ఏంటి? నాకు అదే ముఖ్యమంటూ..
IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్‌ ఘాటు వ్యాఖ్యలు
Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం!

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు