కామెంటేటర్స్‌ మీరు మారండి.. పంత్‌ స్టన్నింగ్‌ రిప్లై

7 Mar, 2021 16:09 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా నాలుగో టెస్టులో విజయం సాధించడం వెనుక రిషబ్‌ పంత్‌ కీలకపాత్ర పోషించాడు. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో పంత్‌.. సుందర్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించడమేగాక అద్భుత సెంచరీ సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ విజయం అనంతరం పోస్ట్‌ ప్రెజంటేషన్‌ సందర్భంగా పంత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తీసుకున్న తర్వాత హర్ష బోగ్లే అతన్ని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.

''ఈ మధ్యన మైక్‌ స్టంప్‌లో నువ్వు చేసే వ్యాఖ్యలు బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే నువ్వే మాట్లాడే మాటలు క్లియర్‌గా లేవని.. కామెంటేటర్లు సైలెంట్‌గా ఉంటే ఇంకా ఎంజాయ్‌ చేస్తామని అభిమానులు అంటున్నారు.. దీనిపై నీ స్పందనేంటి పంత్‌ అని'' ప్రశ్నించాడు. దీనికి పంత్‌ తనదైన శైలిలో పంచ్‌ ఇచ్చాడు. ''వాళ్లు చెప్పినదానిని నేనైతే కాంప్లిమెంట్‌ అని అనుకుంటున్నా. అలా అనిపిస్తే మాత్రం.. సమస్య లేకపోతే మీరు మారండి'' అంటూ బదులిచ్చాడు.  

ఇక నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్‌ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది.  దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం లభించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది.  జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది.

చదవండి:
వైరల్‌: ఇంగ్లండ్‌కు సెహ్వాగ్‌ అదిరిపోయే పంచ్‌
 అరె పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉంది

మరిన్ని వార్తలు